
మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఘటనలో మహిళా సీఐ హస్తం
పీఎం పాలెం (విశాఖపట్నం): మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ ఏసీబీ సీఐ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. నకిలీ ఏసీబీ సీఐ అవతారం ఎత్తిన బలగ సుధాకర్.. ‘సీఐ’గా పనిచేస్తున్న స్వర్ణలతను ‘ఏసీబీ ఎస్‌పీ’గా పేర్కొంటూ సబ్ రిజిస్ట్రార్ (sub registrar) చక్రపాణిని మభ్యపెట్టాడు. ‘ఏసీబీ దాడుల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే సుధాకర్ కోరినట్లుగా రూ. 5 లక్షలు ఇచ్చేయండి’ అంటూ ఆమె కూడా చక్రపాణికి ఫోన్‌లో తెలిపారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న సుధాకర్ ఫోన్ నంబరు ఆధారంగా చేసిన దర్యాప్తులో తాజా అంశం బట్టబయలైంది. దీంతో గతంలో వైజాగ్‌లో పనిచేసి ప్రస్తుతం బాపట్ల (Bapatla) రిజర్వ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న స్వర్ణలత ప్రమేయం ఈ కేసులో ఉందని పోలీసులు తేల్చారు. ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్టయిన సుధాకర్‌తోపాటు, సీఐ స్వర్ణలతను రిమాండ్ నిమిత్తం భీమిలి కోర్టుకు తరలించామని స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపారు.
అసలేం జరిగింది?
బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బలగ సుధాకర్ వచ్చాడు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి, తనను ఏసీబీ సీఐగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో మీ ఆఫీసులో రైడ్ జరగబోతోందని, తనకు 5 లక్షల రూపాయలు ఇస్తే దాడుల ముప్పు నుంచి మిమ్మల్ని కాపాడతానని నమ్మబలికాడు. అతడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పీఎం పాలెం పోలీసులకు చక్రపాణి సమాచారం ఇచ్చారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది.
చదవండి: అంతుచూసిన అనుమానం.. భర్త చేతిలో భార్య దారుణ హత్య