ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరాయి పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో, ఆరు నెలల గర్భిణీ అయిన భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. నిత్యం ఆమెను ఇంట్లోనే బంధించి నరకం చూపించడమే కాకుండా, చివరకు ఆమె తలను నీళ్ల బకెట్‌లో ముంచి ప్రాణాలు తీసిన ఈ ఘటనా వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
రోజుకు 10 గంటల గృహ నిర్బంధం
ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసే అమిత్ గుప్తా (26) అనే వ్యక్తికి, నేహా కుమారి (23) అనే మహిళతో వివాహమైంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అమిత్, ఆమెను ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. ప్రతిరోజూ ఉదయం 8:30 నుండి రాత్రి 7 గంటల వరకు తను ఆఫీసుకు వెళ్లే సమయంలో, నేహాను కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోనే పెట్టి బయట నుండి తాళం వేసేవాడు. ఒంటరిగా మార్కెట్‌కు వెళ్లేందుకు కూడా ఆమెకు అనుమతి ఉండేది కాదు. ఈ విషయాన్ని నేహా తన పుట్టింటి వారితో చెప్పినప్పటికీ వారు ఎప్పుడూ ఆమె భర్తను నచ్చజెప్పలేదు.
బకెట్ నీళ్లలో ముంచి దారుణ హత్య
కొన్నాళ్ల నుండి అమిత్ ఆఫీసుకు వెళ్లడం మానేశాడు. ఈ క్రమంలోనే గురువారం నాడు వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అమిత్.. గర్భవతి అని కూడా చూడకుండా నేహా తలను బలవంతంగా నీళ్లతో నిండిన బకెట్‌లో ముంచి శ్వాస ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. శనివారం నాడు మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో మృతురాలికి శవపరీక్ష నిర్వహించారు. దీనిపై పూర్తి నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
కట్నం కోసమేనా? పోలీసుల దర్యాప్తు
ఈ దారుణానికి సంబంధించి ఫరీదాబాద్ పోలీస్ పీఆర్వో యశ్‌పాల్ యాదవ్ కీలక విషయాలు వెల్లడించారు. నేహా తండ్రి.. అల్లుడు అమిత్ ఒత్తిడి తట్టుకోలేక ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, దానిని అమిత్ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, వారి కోసం ఒక కొత్త ఇల్లు కూడా నిర్మించి ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు అమిత్ గుప్తా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.


