రాజేంద్రనగర్‌లో విషాదం.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో.. | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్‌లో విషాదం.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో..

Published Wed, Jan 24 2024 7:39 AM

brother and sister suicide in rajendranagar - Sakshi

హైదరాబాద్: వారిద్దరూ వరుసకు అక్కా తమ్ముడు అవుతారు. ఏం జరిగిందో ఏమోగానీ ఇద్దరూ వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై మోనిక తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన నర్సింహ గౌడ్, సోమేశ్‌ గౌడ్‌ అన్నదమ్ములు. పన్నెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. 

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ హైదర్‌గూడ కేశవ్‌నగర్‌లో ఇల్లు కట్టుకుని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. పై అంతస్తులో నర్సింహ, స్వప్న దంపతులు తమ ఇద్దరు కుమారులతో పాటు నర్సింహ  మేనమామ కుమారుడు, స్వప్న సోదరుడైన శేఖర్‌ (26) ఉంటున్నారు. కింది అంతస్తులో సోమేశ్, ఆయన భార్య స్రవంతి (28), ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నారు. నర్సింహ, సోమేశ్‌ అన్నదమ్ములిద్దరూ ప్రైవేటు జాబ్‌ చేస్తుండగా.. శేఖర్‌ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.  

పిల్లలు ఇంటికి వచ్చి చూడగా.. 
మంగళవారం స్వగ్రామంలో బంధువు దశదిన కర్మ ఉండటంతో నర్సింహ, సోమేశ్‌తో పాటు స్వప్న వెళ్లారు. ఉదయం పిల్లలను స్కూల్‌లో వదిలి వచ్చిన సోమేశ్‌ భార్య స్రవంతి ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్రవంతి కుమారులు శశి, చందు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. గది లోపలి వెళ్లగా తల్లి ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. భయంతో వెంటనే బయటికి వచ్చి పక్కింటి వారితో ఈ విషయం చెప్పారు. వారు సోమేశ్‌కు సమాచారం అందించారు. 

విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హాల్‌లో స్రవంతి, బెడ్రూంలో శేఖర్‌ ఉరేసుకొని విగతజీవులై కనిపించారు. పంచనామా చేసి ఇరువురి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న నర్సింహ, సోమేశ్, స్వప్న ఇంటికి చేరుకున్నారు. ఏ కారణంతో స్రవంతి, శేఖర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియడం లేదని, తామంతా కలిసి మెలిసి ఉండేవాళ్లమన్నారు. శేఖర్‌ ఐదేళ్లుగా తమతోనే ఉంటున్నాడని.. వరుసకు తమకు మేనమామ కుమారుడు అవుతాడని నర్సింహ, సోమేశ్‌ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement