యువత.. భ్రాంతిలో భవిత | - | Sakshi
Sakshi News home page

యువత.. భ్రాంతిలో భవిత

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

నిరుద్యోగులకు టోపీ పెట్టిన

చంద్రబాబు ప్రభుత్వం

గందరగోళంగా డీఎస్సీ నోటిషికేషన్‌

రోస్టర్‌ ప్రకటించకుండా ఖాళీల ప్రకటన

సామాజికవర్గాల వారీగా

కేటాయింపులపై లేని స్పష్టత

అయోమయంలో అభ్యర్థులు

పాఠశాలల మూసివేతపై ఆందోళన

నవోదయలో చదివిన వారికి మొండిచేయి

ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, నిరుద్యోగ యువత ఆశలతో చెలగాటమాడుతూ మరో మోసపూరిత నాటకానికి తెరతీసింది. లక్షలాది మంది అర్హులైన యువతీయువకులు ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే...తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కేవలం మభ్యపెట్టేలా ఉంది. వేలాది మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే కేవలం వందల సంఖ్యలో పోస్టులను కేటాయించడం సర్కారు వంచనకు పరాకాష్టగా నిలుస్తోంది.

చిత్తూరు కలెక్టరేట్‌ : తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషనన్‌లో ఎన్నడూ లేనివిధంగా కేవలం ఖాళీల సంఖ్యను మాత్రమే ప్రకటించారు. అసలైన రిజర్వేషన్లు, కేటగిరీల వారీగా రోస్టర్‌ పాయింట్లను పూర్తిగా విస్మరించారు. ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులు కేటాయించారనే కనీస స్పష్టత లేకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడం డీఎస్సీ చరిత్రలో ఇదే మొదటిసారని అభ్యర్థులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు. రోస్టర్‌ పాయింట్లు లేకుండా నోటిఫికేషన్‌ జారీ చేస్తే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకుండా అడ్డుకోవచ్చనే కుట్ర జరుగుతోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తాజా డీఎస్సీ నోటిఫికేషన్‌లో స్పష్టత లేకుండా అభ్యర్థులను తీవ్రమైన అయోమయలోకి నెట్టేశారు. 2025 డీఎస్సీ లాగానే ఈ పర్యాయం కూడా నియామక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతున్నారనే అనుమానాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.

వింత నిబంధనలతో చెలగాటం

క్లస్టరైజేషన్‌, రేషనలైజేషన్‌ ముసుగులో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను మూసివేసే కుట్రలు జరుగుతున్నాయని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయ కుండా ఉన్న బడులను తొలగించి విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవోదయ పాఠశాలల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్షకు అనర్హులని పేర్కొనడం అన్యాయమని మండిపడుతున్నారు. అన్ని ఉన్నత విద్యా ర్హతలున్నప్పటికీ నవోదయ పాఠశాలలో చదివిన వారికి తెలుగు సబ్జెక్ట్‌ లేదనే సాకుతో అనర్హులనడం దారుణమని స్పష్టం చేస్తున్నారు. ఎన్నడూ లేని వింత నిబంధనను బాబు సర్కారు అమల్లోకి తీసు కొచ్చిందని విమర్శిస్తున్నారు.

144 పోస్టులకే నోటిఫికేషన్‌

జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 7,904 పోస్టులు ఉండాలి. అయితే ప్రస్తుతం 6,804 మంది టీచర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 1,100 పోస్టుల వరకు ఖాళీలున్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. వేల సంఖ్యలో ఖాళీ లుండగా వందల సంఖ్యకు నోటిఫికేషన్‌ జారీ చేసి చంద్రబాబు సర్కారు అభ్యర్థులను మోసంచేస్తోంది. పలు ఆంక్షలు విధించి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకుండా అడ్డుకుంటోంది.

తాజా డీఎస్సీ నోటిఫికేషన్‌

పోస్టుల వివరాలు

జెడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ బడుల్లోని పోస్టులు 125

మున్సిపల్‌ మేనేజ్‌మెంట్‌లోనివి 05

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ 06

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీ కేడర్‌ 08

మొత్తం పోస్టులు 144

జిల్లాలోని ప్రభుత్వ

పాఠశాలల సమాచారం

ప్రాథమిక బడులు 1,702

విద్యార్థులు 48,231

ప్రాథమికోన్నత పాఠశాలలు 40

విద్యార్థులు 2,458

హైస్కూళ్లు 305

విద్యార్థులు 59,983

మొత్తం పాఠశాలలు 2,047

మొత్తం విద్యార్థులు 1,10,672

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement