రౌతుసూరమాల సర్పంచ్ అభ్యర్థితోపాటు వార్డు సభ్యులపై పిడిగుద్దులు రక్తమోడుదుతున్నా పట్టించుకోని పోలీసులు బాధితులకు అండగా నిలిచిన ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి తమ పార్టీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్
సాక్షి, తిరుపతి/ తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దళితులపై దమనకాండ కొనసాగుతోంది. టీడీపీ అల్లరిమూకలు, అద్దెరౌడీలకు బలికావాల్సి వస్తోంది. శాంతిభద్రతలు పరిక్షించాల్సిన పోలీసులు, నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిస్తోంది.
బాధితులకు అండగా నిలిచిన నేతలు
విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తమోడుతున్న క్షతగాత్రులను హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవలందేలా చర్యలు చేపట్టారు.
తిరగబడ్డ దళితులు
రౌతుసూరమాల గ్రామస్తులు అధికార అరాచకాలపై తిరగబడ్డారు. శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ధర్నాకు దిగారు. టీడీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దళితులకు రక్షణ కల్పించాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీలపై దాడా సిగ్గుచేటు
రెక్కాడితేడొక్కాడని ఎస్సీలపై టీడీపీ అగ్రవర్ణాల వారు దాడి చేయించడం సిగ్గుచేటని రౌతుసూరమాల గ్రామస్తులు ధ్వజమెత్తారు. చిట్టత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు బాలాజీరెడ్డి, అతని వర్గీయులే తమపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు, అధికారుల ఎదుటే దాడి చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎస్సీ కులానికి చెందిన తమపై టీడీపీ అగ్రకుల నాయకులు దాడి చేయడం సమంజసం కాదన్నారు.
కఠినంగా శిక్షించండి
మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. టీడీపీ నాయకులు కిరాయి రౌడీలతో తమ అభ్యర్థులపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా లేదన్నారు. పోలీసుల ఎదుటే ఎస్సీలపై దాడి చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడమంటే ఇదేనా.. అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో రౌడీ రాజకీయం సాగుతోందని, ఇది ఎంతో కాలం సాగదని, మున్ముందు వడ్డీతో సహా తీర్చుకునే రోజులు వస్తాయని హెచ్చరించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ అభ్యర్థులకు రక్షణ కల్పించి నామినేషన్లు వేయించాలని అధికారులకు సూచించారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు, తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిల సుబ్రహ్మణ్యం, చింతా రాజేంద్ర తదితరులు ఉన్నారు.
టీడీపీ రౌడీల దాడిలో తీవ్రంగా గాయపడిన వార్డు మెంబర్ అభ్యర్థులు నాగరాజు, కార్తీక్
తొట్టంబేడులో రెచ్చిపోయిన టీడీపీ అల్లరిమూకలు
రౌతుసూరమాలలో రక్తసిక్తం
తొట్టంబేడు మండలంలోని రౌతుసూరమాల పంచాయతీ సోమవారం రక్తసిక్తమైంది. టీడీపీ అల్లరిమూకల దాడులు, దౌర్జన్యాలతో అట్టుడికింది. అద్దెరౌడీల అరుపులు, కేకలతో మార్మోగింది. వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి కర్లపూడి చిన్నజల్లి పాపయ్య, వార్డు మెంబర్ అభ్యర్థులు ఎం.నాగరాజు, కార్తీక్ సోమవారం నామినేషన్ వేసేందుకు జ్ఞానమ్మకండ్రిగకు బయల్దేరారు. అంతలో సుమారు 50 మంది రౌడీలు వచ్చి వాలిపోయారు. కర్రలు, రాడ్లు, పదునైన కత్తిలాంటి ఆయుధాలతో అడ్డుతగిలారు. నామినేషన్ పత్రాలు ఇచ్చేయాలంటూ బెదిరింపులకు దిగారు. లేకుంటే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆపై అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించారు. ప్రతిఘటించిన వార్డు మెంబర్ అభ్యర్థులు నాగరాజు, కార్తీక్‌పై దాడికి పూనుకున్నారు. కర్రలతో నాగరాజు తలను పగలగొట్టారు. ఆపై కర్రలతో చితకబాదారు. కార్తీక్‌పై పదునైన ఆయుధంతోదాడి చేశారు. మహిళలు, స్థానికులు అడ్డుకోవడంతో వారిపై దాడికి పూనుకున్నారు. మహిళలనీ చూడకుండా వారిపట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆపై కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పల్లెపోరులోనూ అదే పంథా
– ఆదివారం దాడి.. సోమవారం పత్రాల చింపివేత
తొట్టంబేడు మండలంలోని కొత్తకండ్రిగ పంచాయతీ జ్ఞానమ్మకండ్రిగ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడానికి ఆదివారం పెద్దకన్నలి నామినేషన్ కేంద్రానికి వెళ్లగా అక్కడ దాడి చేసి పత్రాలు లొక్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్, ఎస్పీకి సైతం వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగని టీడీపీ నాయకులు సోమవారం సాయంత్రం జ్ఞానమ్మకండ్రిగ లోని తన ఇంట్లో నామినేషన్ పత్రాలు సిద్ధం చేస్తుండగా సుమారు 30 మంది వచ్చి నామినేషన్ పత్రాలు చించివేశారని సర్పంచ్ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తమకు పోలీసులు రక్షణ కల్పించి నామినేషన్ వేయించాలని ఆయన కోరారు.
చోద్యం చూస్తున్న పోలీసులు
స్థానిక సంస్థల వేళ కూటమి నేతలు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలసి తమ అభ్యర్థులకు భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మున్సిపల్, పంచాయతీ నామినేషన్ల సందర్భంగా ఆది, సోమవారాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేసి నామినేషన్ పత్రాలను టీడీపీ నేతలు లాక్కెళ్లారు. అఽధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు వారి అరాచకాలకు వంతు పాడుతున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు అయినా పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు.


