● రెండు ఐదొందల నోట్లను బ్యాలెట్లో వేసిన ఓటరు ● పలమనేరు మండలంలోని మొరం సెగ్మెంట్లో వెలుగులోకి ● ప్రజాసామ్యంలో ఇదో స్ఫూర్తిదాయక చర్య అన్న కలెక్టర్
పలమనేరు: తమ విలువైన ఓట్లను అమ్ముకుంటున్న నేటి సమాజంలో ఓ ఓటరు మాత్రం తన ఓటు డబ్బుకు అమ్ముకోనంటూ అభ్యర్థి పంచిన రూ.500 రెండు నోట్లను తన బ్యాలెట్ పేపర్లో పెట్టి ‘‘అయ్యా మీర్చిన డబ్బులు రూ.1,000 మీరే తీసుకోండి. మేం డబ్బులు తీసుకుని ఓటు వేసేవారం కాదు సుమా. ధన్యవాదాలు’’ అంటూ ఓ కాగితం రాసి బ్యాలెట్ బాక్సులో వేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పలమనేరు మండలం మొరం సెగ్మెంట్లో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో దీన్ని గమనించిన అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఇది ప్రజాసామ్యంలో చాలా స్ఫూర్తిదాయక చర్యగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటుకు తన ఓటును తాకట్టు పెట్టనని ఆ ఓటరు తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువకు నిదర్శనంగా మారింది. ఓటుకు డబ్బు తీసుకుంటే ఐదేళ్లు ప్రజాప్రతినిధిని తాము ప్రశ్నించే హక్కును కోల్పోతామని ఆ ఓటరు భావించి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రతి ఓటరును ఆలోచింపజేస్తోంది.


