రెండు రోజుల్లో సర్పంచ్ పదవులకు 789 వార్డు సభ్యులకు 1,936 నామినేషన్లు దాఖలు రెండోరోజు పెరిగిన నామినేషన్ల సంఖ్య కుప్పం, పలమనేరు రెవెన్యూ డివిజన్లలో వేడెక్కిన పల్లె రాజకీయం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. కుప్పం, పలమనేరు రెవెన్యూ డివిజన్లలోని 9 మండలాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల నామినేషన్ల పర్వంలో రెండో రోజు సోమవారం అభ్యర్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 15న ప్రారంభమైన తొలి దశ నామినేషన్ల ప్రక్రియలో సోమవారం అందిన అధికారిక నివేదిక (ప్రొఫార్మా–2) ప్రకారం రెండు రోజుల్లో మొత్తం 182 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు 789 నామినేషన్లు, 1,908 వార్డు సభ్యుల పదవులకు 1,936 నామినేషన్లు దాఖలయ్యాయి.
రెండో రోజు అధికం
మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు నామినేషన్ల దాఖలు అధికంగా నమోదయ్యాయి. మొదటి రోజైన ఆదివారం 9 మండలాల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 178 నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు సోమవారం ఏకంగా 609 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, వార్డు సభ్యుల పదవులకు మొదటి రోజు 248 నామినేషన్లు రాగా, రెండో రోజు ఆ సంఖ్య 1,664 కు చేరుకుంది. దీంతో రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 789, వార్డు స్థానాలకు 1,936 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
కుప్పం రెవెన్యూ డివిజన్‌లో అధికం
కుప్పం రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో (92 పంచాయతీలు, 952 వార్డులు) నామినేషన్లు అధికంగా నమోదయ్యాయి.
పలమనేరు డివిజన్‌లో హోరాహోరీ
పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో (90 పంచాయతీలు, 956 వార్డులు) సైతం అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. ఈ డివిజన్‌లో పెద్దపంజాణి మండలం సర్పంచ్ నామినేషన్‌ల్లో, బైరెడ్డిపల్లి మండలం వార్డు నామినేషన్లలో ముందున్నాయి. నామినేషన్ల స్వీకరణకు మంగళవారం (మూడో రోజు) చివరి అవకాశం కావడంతో అన్ని మండలాల్లో మరింత రద్దీ నెలకొనే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


