తిరుపతి అర్బన్: ‘ఇదేంటి సార్ ఇంత అన్యాయమా...? మా వాళ్లు ఎవరి జోలికీ వెళ్లకుండా వాళ్లు సిద్ధం చేసుకున్న నామినేషన్ పత్రాలతో కేంద్రానికి వెళుతుంటే అధికార పార్టీకి చెందిన వారు నామినేషన్లు వేయనీయకుండా దాడులు చేస్తున్నారు’ అంటూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, పార్టీ సీనియర్ నేత ఉన్నం వాసుదేవనాయుడు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలను వివరించారు. ప్రధానంగా తొట్టంబేడు మండలంలో నామినేషన్లు వేయనీయకుండా అధికారపార్టీకి చెందిన నేతలు దాడులకు పాల్పడిన ఘటనలకు చెందిన ఫొటోలు, వీడియోలను కలెక్టర్‌కు చూపించారు. దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు.
భద్రత కల్పిస్తాం
నామినేషన్లు వేయలేని ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ భద్రత కల్పిస్తాం. తొట్టంబేడు మండలంతోపాటు ఇతర ప్రాంతాల్లో నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు పడుతున్న వారు నామినేషన్లు వేయడానికి అవకాశం కల్పిస్తాం.
– ఎస్.వెంకటేశ్వర్, కలెక్టర్, తిరుపతి జిల్లా


