చంద్రగిరి రోడ్డు ప్రమాదంతో
గ్రామంలో విషాదఛాయలు
ఒకే కుటుంబానికి చెందిన
ముగ్గురు వ్యక్తులు మృతి
మరో మహిళ కూడా దుర్మరణం
బంగారుపాళెం: ఊరు కన్నీరు పెట్టింది. తమ ఒడిలో పెరిగి పెద్దవారైన నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ దేవదేవుడు కూడా కాపాడలేదా..? అంటూ శోకసముద్రంలో మునిగిపోయిందా.. అన్నట్టు మారింది మండలంలోని గుర్రంకొండవాండూరు. దైవదర్శనం కోసం తిరుమలకు బయలుదేరిన బంగారుపాళెం మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు మార్గమధ్యంలో చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం రాత్రి మృతి చెందారు. దాంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నారు. వివరాలు.. బంగారుపాళెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుర్రంకొండవాండ్లఊరుకు చెందిన చంద్రగిరి లక్ష్మీనారాయణ, అతని తండ్రి సిద్ధయ్య, పెద్దనాన్న సుబ్రమణ్యం, అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం భార్య కుప్పాల రజినితో కలసి శనివారం సాయంత్రం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తమ సొంత టాటా సుమోలో తిరుమలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం మార్గమధ్యంలో చంద్రగిరి మండలం, పనపాకం సమీనంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
బంగారుపాళెం: గుర్రంకొండవాండ్ల ఊరులో మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
శోకసముద్రంలో
గుర్రంకొండవాండ్ల ఊరు


