చదువుల తల్లికి.. కూటమి సంకెళ్లు | - | Sakshi
Sakshi News home page

చదువుల తల్లికి.. కూటమి సంకెళ్లు

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

ఫీజుల భారం మోయలేకపోతున్న

విద్యార్థుల తల్లిదండ్రులు

విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం

సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న

యాజమాన్యాలు

సీఎం సొంత జిల్లాలో విద్యార్థుల

ఆక్రందన

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఐటీఐ, నర్సింగ్‌, పాలిటెక్నిక్‌, మెడికల్‌, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు మొత్తం 183 ఉన్నాయి. ఇందులో 24,149 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకుండా ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోంది. భారాన్ని మోయలేక విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్నత విద్య కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా, పరీక్షలు రాయనివ్వకుండా గొంతు కోస్తున్నా పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. చివరకు ఈ ఫీజుల వేధింపులే ఇటీవల చిత్తూరు నగర సరిహద్దులో ఎస్వీ సెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. ఫీజుల వేధింపులపై ఆ కళాశాలలోని వేలాది మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు రోడ్డెక్కారు. చంద్రబాబు సర్కారు తీరుపై ధర్నాకు దిగారు. అయినా సర్కా రులో ఏ మాత్రం పశ్చాతాపం లేదు.

ఉన్నత విద్యపై అలసత్వం

అమరావతిలో కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టేందుకు, లెక్కలేనన్ని అప్పులు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వానికి డబ్బులు ఉంటున్నాయి. కానీ పేద విద్యార్థుల చదువుల బకాయిలు చెల్లించడానికి మాత్రం నిధులు ఉండడం లేదని విద్యార్థి సంఘా లు విమర్శిస్తున్నాయి. 2024 నుంచి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉన్నత విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోతున్నాయి.

నాటికీ.. నేటికీ పొంతన లేదు

గత వైఎస్‌ఆర్‌సీపీ సర్కారు పాలనలో ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేశారు. సకాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులు రావడంతో గతంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకున్నారు. కానీ, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలు పేరుకుపోవడంతో నిర్వాహకులు ఆ భారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై మోపుతున్నారు.

వేల కోట్ల బకాయిలు

చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థుల ఉన్నత విద్యకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. జిల్లాలోని చిత్తూరు, కుప్పం, నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు, పలమనేరు ప్రాంతాల్లోని పేద విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. గత 13 త్రైమాసికాలుగా జిల్లాలో విద్యాదీవెన రూ.32 కోట్లు, వసతి దీవెన రూ.18 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కంటితుడుపు చర్యగా కొంత బడ్జెట్‌ను విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆయా కార్యాలయాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల నివేదికలు లేకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తం నివేదికలన్ని రాష్ట్ర స్థాయిలోనే మానిటరింగ్‌ చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారు.

తల్లిదండ్రులపై అప్పుల భారం

ప్రభుత్వం నుంచి ఫీజులు జమకాకపోవడంతో జిల్లాలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని, తరగతులకు అనుమతిస్తామని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కోర్సులు పూర్తి చేసుకున్న చివరి సంవత్సరం విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్నారు. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు అధిక వడ్డీలకు అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.

జిల్లాలోని కళాశాలల సమాచారం

డిగ్రీ కళాశాలలు 116

ఇంజినీరింగ్‌ కళాశాలలు 14

ఐటీఐ కళాశాలలు 18

నర్సింగ్‌ కళాశాలలు 07

పాలిటెక్నిక్‌ 08

మెడికల్‌ 02

బీఈడీ 07

ఎంబీఏ, ఎంసీఏ 11

మొత్తం కళాశాలలు 183

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఎగ్గొడుతున్న చంద్రబాబు సర్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement