చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో రెండో దశ జనాభా గణన ప్రక్రియను పకడ్బందీగా, సమర్థవంతంగా చేపట్టాలని డీఆర్‌వో మోహన్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం జనగణనపై జిల్లాస్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ ప్రారంభించారు. డీఆర్‌వో మాట్లాడుతూ శిక్షణలో వివరించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా గమనించాలన్నారు. సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రజల ఇళ్లకు వెళ్లినప్పుడు స్నేహపూర్వకంగా, ఓపికగా వ్యవహరించి వారి సహకారం కోరాలన్నారు. ప్రస్తుతం 68 మంది ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత డిసెంబర్ 5 నుంచి ఫీల్డ్ ట్రైనర్లు జిల్లాలోని సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారని తెలిపారు. గతంలో తలెత్తిన మ్యాపింగ్ లోపాలు, ఖాళీ ఇళ్ల వంటి సమస్యలను పరిశీలించి 99.9 శాతం వరకు సరిదిద్దినట్లు వెల్లడించారు. జిల్లాలో సుమారు 3,000లకు పైగా హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను రాష్ట్ర స్థాయి ఆడిట్‌తో తుది గణనకు సిద్ధం చేశారని పేర్కొన్నారు. దేశంలో 1872 నుంచి జనాభా గణన జరుగుతుండగా, 2027లో నిర్వహించేది 16వ జనగణన అని చెప్పారు. స్వాతంత్య్రానంతరం 8వ జనాభా గణన అని అధికారులు తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రక్రియలో తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ మాధ్యమాలను వినియోగిస్తున్నారన్నారు. ఎన్యూమరేటర్లు మొబైల్ యాప్‌లతో డేటాను సేకరిస్తారని తెలిపారు. పౌరులు తమ వివరాలను ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారన్నారు. దీనిని ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో ధృవీకరిస్తారని తెలిపారు.


