వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం మద్దలవారి కండ్రిగ సమీపంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడు బాలినాయుడు కండ్రిగ పంచాయతీ ఎన్వీఆర్ కండ్రిగ ఆదిఆంధ్రవాడకు చెందిన సురేష్ (30)గా గుర్తించారు. తలకు బలమైన గాయం కావడంతో పుర్రె పైకి లేచి రక్తపు మడుగులో మృతదేహం పడివుంది. సమీపంలో మద్యం సేవించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మద్యం సేవిస్తూ జరిగిన గొడవ హత్యకు దారితీసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు స్వగ్రామం ఎన్వీఆర్ కండ్రిగ ఆదిఆంధ్రవాడ అయినా తిరుచానూరులో భార్య గౌతమి, రెండేళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. దీపావళికి గ్రామంలో నివసిస్తున్న అమ్మ మునిరాజమ్మ వద్దకు వచ్చి బైక్‌పై తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు.
భార్య ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడి ఆనవాళ్లను సేకరించారు. మద్యం మత్తులో గొడవకు దారితీసిన పరిస్థితులు, ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఇది రోడ్డు ప్రమాదమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య గౌతమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడమాలపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


