పలమనేరు: పట్ణణ సమీపంలోని ఎక్స్‌ప్రెస్ హైవేకి ఆనుకుని ఉన్న టీఎస్ అగ్రహారం కొత్త చెరువు గట్టుపై చెరువు భూమిని కొందరు అధికార పార్టీ నేతల అండదండలతో ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే జేసీబీ వాహనాలను పెట్టి చెరువు పోరంబోకు మూడెకరాలను ఆక్రమించేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అసలు పట్టించుకోలేదు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చెంగప్ప, క్రిష్ణప్ప, రమేష్, మహేష్ ఈ చెరువు భూమిని ఆక్రమించుకున్నారు. తమకు స్థానిక ఎమ్మెల్యే చెప్పారని ఆక్రమణదారులు చెప్పడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇరిగేషన్ అధికారులు అధికార పార్టీకి ఏజెంట్‌లా మారాడనే మాట వినిపిస్తోంది. కనీసం రెవెన్యూ ఉన్నత అధికారులైనా దీనిపై చర్యలు తీసుకుంటారా అనుకుంటే వారు కూడా అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లను భరించలేక దీర్ఘకాలిక సెలవులో వెళ్ళిపోయారంటే ఇక్కడ పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా చెరువుకు సంబంధించిన లక్షల రూపాయల విలువజేసే భూమి పరులపాలు కానుంది. దీనిపై జిల్లా కలెక్టర్ అయినా చొరవచూపి వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది.


