చిత్తూరు రూరల్ (కాణిపాకం): వైద్యరంగంలో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని డీఎంహెచ్‌ఓ నాగశశి భూషణ్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా శనివారం చిత్తూరు గనరం నగరంలోని ఎన్జీఓ హోమ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోగులకు మందులను ఏ మోతాదులో, ఎలా వాడాలనే దానిపై కౌన్సెలింగ్ ఇస్తూ ఫార్మసిస్టులు గొప్ప సామాజిక సేవ అందిస్తున్నారన్నారు. అనంతరం జిల్లాలో విశిష్ట సేవలు అందించిన ఉత్తమ ఫార్మసిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలోనే ఏపీ ఫార్మసిస్ట్ అసోసియేషన్ జిల్లా శాఖ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఏడుగురు సభ్యులను నూతనంగా ఎన్నుకున్నారు.
జాతీయ స్థాయి పోటీలకు వెదురుకుప్పం విద్యార్థి
వెదురుకుప్పం : జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు వెదురుకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి చిన్మయ సాయి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయడు శివశంకరయ్య తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్‌ఎం మాట్లాడుతూ మహారాష్ట్రలోని సి. శంభాజీనగర్‌లో ఆదివారం నుంచి 30 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకి చిన్మయ సాయి ఎంపికై నట్లు వెల్లడించారు. అనంతరం పుత్తూరు డీవైఈఓ మహేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో చిన్మయ సాయి అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్‌ను అభినందించారు. అనంతరం విద్యార్థి చిన్మయ సాయి, ఉపాధ్యాయుడు రమేష్‌ను ఘనంగా సత్కరించారు.


