కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారికి శనివారం పలువురు భక్తులు భారీ విరాళాలు సమర్పించారు. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన మల్లయ్య, రాజ్యలక్ష్మి దంపతులు రూ.2.50 లక్షల విలువైన, సుమారు 1 కిలో బరు వు కలిగిన వెండి పుష్పమాలను బహూకరించారు. అలాగే నిత్య అన్నదాన ట్రస్టుకు రూ. ఒక లక్ష విరాళంగా అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోమసత్య శ్రీనివాసరావు తమ కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి నిత్య అన్నదాన పథకానికి రూ. ఒక లక్ష విరాళాన్ని ఆల య అధికారులకు అందించారు. దాతలకు ఆల య అధికారులు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించారు. తీర్థప్రసాదాలు అందజేశారు.
సర్ సిబ్బందికి జీతాలు మంజూరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సర్ కార్యక్రమంలో విధులు నిర్వహించిన సిబ్బందికి వార్షిక జీతాలు మంజూరు చేశారు. శనివారం ఈ మేరకు ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈఆర్‌ఓలకు రూ.30 వేలు, అదనపు ఈఆర్‌ఓలకు రూ.25 వేలు మంజూరు చేశారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఈఆర్‌ఓ, 80 మంది ఏఈఆర్‌ఓలు, 1,708 మంది బీఎల్‌ఓలు, 176 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. బీఎల్‌ఓ, సూపర్‌వైజర్లకు రూ.6 వేల చొప్పున మంజూరు చేశారు.
నేడు బధిరుల దినోత్సవం
చిత్తూరు కలెక్టరేట్: అంతర్జాతీయ బధిరుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులశాఖ ఏడీ పుల్లారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని బధిరుల సంఘాల ప్రతినిధులు, బధిర ప్రభుత్వ ఉద్యోగులు హాజరుకావాలని కోరారు.


