చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు సరిగ్గా చెప్పకుండా అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని డీఈఓ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన సాక్షి నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఇటీవల చిత్తూరులోని గిరింపేట, సంతపేట నగరపాలక హైస్కూళ్లలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు డీఈఓ వివరించారు.
సాక్షి: ఇటీవల మీ ఆకస్మిక తనిఖీల్లో గమనించిన ప్రధాన అంశాలేమిటి? ఉపాధ్యాయుల పనితీరుపై మీ అభిప్రాయం?
డీఈఓ:కొన్ని పాఠశాలల్లో తరగతి గదిలో విద్యార్థులు ఉన్నప్పటికీ నాన్ లాంగ్వేజ్ టీచర్లు పాఠాలు చెప్ప కుండా స్టాఫ్ రూమ్‌లో ఖాళీగా కూర్చోవడం గమనించాం. ఇది అత్యంత బాధాకరం. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు, శాఖాపరమైన చర్యలు తప్పవు.
సాక్షి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఈఓ: 2027 మార్చి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ’మిషన్ మార్చ్ 2027’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని 341 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో మొత్తం 13,989 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరి అభ్యసన సామర్థ్యాల ఆధారంగా గ్రేడ్లుగా విభజించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇస్తున్నాం.
సాక్షి: రాబోయే రోజుల్లో పాఠశాలల పర్యవేక్షణ, సమీక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి?
డీఈఓ: త్వరలోనే కలెక్టర్ అధ్యక్షతన హెచ్‌ఎంలతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. నియోజకవర్గ, మండల, పాఠశాల స్థాయిల్లో సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కులను విశ్లేషిస్తాం. ముఖ్యంగా గత పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత సాధించిన 75 పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.
సాక్షి: విద్యాబోధన నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
డీఈఓ: ఏదో పాఠం చెప్పామా, వెళ్లామా అన్నట్టు కాకుండా, ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా లెసన్ ప్లాన్ సిద్ధం చేసుకునే బోధించాలి. పరీక్షల్లో విద్యార్థులు ఎందుకు తక్కువ మార్కులు సాధిస్తున్నారో బాధ్యత తీసుకుని వివరణ ఇవ్వాలి. నిరంతరం క్షేత్రస్థాయి తనిఖీలు చేపడతాం, బోధనలో వెనుకబడినా, అలసత్వం వహిస్తే ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరుతున్నాం.


