జిల్లాలో 1.36 లక్షల ఓటర్ల వివరాలు తొలగింపు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ఆరోపణల నేపథ్యంలో సర్ ప్రక్రియలో పారదర్శకతపై అందరిలో అనుమానం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే ప్రచురించిన జాబితాలో ఏకంగా 1.36 లక్షల ఓట్లు తొలగించడంలో ఆంత్యమేంటనే ప్రశ్న తలెత్తుతోంది.
సాక్షి, చిత్తూరు: సర్ ప్రక్రియలో భాగంగా తొలి జాబితా ప్రచురణ సమయంలో జిల్లా నుంచి 1,36,059 ఓట్లను అధికారులు తొలగించారు. ఈ సంఖ్య అసాధారణంగా కనిపిస్తోంది. దీనికి అధికారులు చెబుతున్న కారణాలు చనిపోయిన ఓటర్లు 42,337, ట్రేస్ కాని ఓటర్లు 18,622, వసల వెళ్లిపోయిన వాళ్లు 55,773, డబుల్ ఎంట్రీ 19,301, ఇతర కారణాలు 26 మంది ఓటర్లుగా చూపించారు. ఇందులో చనిపోయిన ఓటర్ల సంఖ్య తప్ప మిగిలినవన్నీ ‘సర్’ పేరిట అక్రమంగా తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మ్యాపింగ్ కాకపోవడం, పేర్లలో వ్యత్యాసం, అక్షర దోషాలు ఉన్నాయనే కారణాలతో జిల్లాలో ఏకంగా 1,34,307 మందికి నోటీసులు ఇవ్వడం కూడా సంచలనమే. అయితే ఇందులో ఇప్పటి వరకు 1,31,472 మంది క్‌లైయిమ్స్‌ను అధికారులు అంగీకరించారు. వీరందరికీ ఓటు హక్కును పునరుద్దరించారు. దాదాపు 2500 మంది ఓటర్లు అనర్హులుగా తేల్చడంతో.. తొలగింపు ఓట్లు 1.40 లక్షలకు చేరుకోనుంది.
తప్పటడుగు అక్కడే..
2002 ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలను ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పిన సీఈసీ తొలి తప్పటడుగు అక్కడే వేసింది. జిల్లాలో చాలా మంది ఓట్లు అసలు 2002 జాబితాలో మ్యాపింగ్ కాలేదు. 24 ఏళ్ల తర్వాత ఇపుడు మ్యాపింగ్‌కు వెళితే చాలా మంది ఓటర్ల వివరాలు 2002లో అసలు కనిపించలేదు. పైగా కుటుంబ సభ్యుల మ్యాపింగ్ ఏమాత్రం కుదరలేదు.‘సర్’ ప్రక్రియలో ఏకంగా తమ అభ్యంతరాలనే సీఈసీ 14 సార్లు పట్టించుకోలేదని తోటి కమిషనర్లు సీఈసీపై ఆరోపణలు చేశారు.. జిల్లాలో ప్రతిపక్ష నేతలు ఇచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా అసలు సర్ ప్రక్రియ సజావుగా సాగిందా..? లేదా..? అనే అనుమానం సామాన్యుల్లో సైతం వ్యక్తమవుతోంది. అసలు 2002లో సరైన ఓటర్ల జాబితా ఎందుకు రూపొందించలేదని ఓటర్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
తుది జాబితాపై కసరత్తు
షెడ్యుల్ ప్రకారం మ్యాపింగ్ కాని, సవరణ చేయాల్సిన ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 9వ తేదీన ప్రచురించాల్సి ఉంది. ఇందుకోసం అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. సీఈసీ ఎదుర్కొంటున్న ఆరోపణలు ఓవైపు, నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారనే విమర్శల నడుమ అధికారులు తుది జాబితా ప్రచురణకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఓటర్ల నుంచి కొత్తగా దరఖాస్తు తీసుకుని, జాబితాలో పేరును చేరుస్తామని చెప్పడం ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సి ఉంది.
జిల్లాలో నియోజకవర్గ వారీగా తొలగించిన ఓట్ల సంఖ్య
పలమనేరు 29,381
చిత్తూరు 26,436
కుప్పం 24,418
నగరి 20,879
పూతలపట్టు 20,321
జీడీ నెల్లూరు 14,624
మొత్తం 1,36,059
నమ్మశక్యంగా లేదు
సార్వత్రిక ఎన్నికల సమయంలో చీకటి పడిన తర్వాత భారీగా ఓట్లు పోలవడంపై మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం ఎలాంటి సమాధనం చెప్పలేదు. ఇప్పుడు ‘సర్’ ప్రక్రియలో తోటి కేంద్ర ఎన్నికల కమిషనర్లు చెప్పిన అభ్యంతరాలనే సీఈసీ పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడం మా అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. జిల్లాలో ఏకంగా 1.36 లక్షలకు పైగా ఓట్లు తొలగించడం అంటే నమ్మశక్యంగా లేదు. దీనిపై ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పి తీరాల్సిందే. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు


