చిత్తూరు రూరల్ (కాణిపాకం): పోలీసులు ప్రజాసేవే పరమావధిగా విధులు నిర్వర్తించాలని, పోలీసు యూనిఫామ్ కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, మహత్తర బాధ్యతకు ప్రతీకని రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మైదానంలో 9 నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులను గౌరవిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ క్రమశిక్షణతో పనిచేస్తూ, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు భరోసానిచ్చేలా పోలీసు శాఖ ప్రతిష్టను పెంచాలని పిలుపునిచ్చారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చీకటి మూర్తి (బెస్ట్ ఆల్‌రౌండర్– అవుట్‌డోర్), వెంకటేష్ (ఇండోర్), వినయ్ (ఫైరింగ్), 5వ స్క్వాడ్ (బెస్ట్ స్క్వాడ్)కు మంత్రి, అధికారులు మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, మురళీమోహన్ పాల్గొన్నారు.


