– మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
చిత్తూరు కలెక్టరేట్ : సమాజంలో ఎదురయ్యే పలు సమస్యలకు సైన్స్‌తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. స్థానిక విజయం ఇంజినీరింగ్ కాలేజీలో ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నార్మన్ బోర్లాంగ్ పొట్టి రకాల వరి వంగడాలను రూపకల్పన చేయడంతో కోట్లాది మంది ఆకలి తీరిందన్నారు. భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి సైన్స్ ఎంతో దోహదపడిందని గుర్తుచేశారు.
రసవత్తరంగా సైన్స్ పోటీలు
సైన్స్ పోటీల్లో జిల్లాలోని 28 మండలాలకు చెందిన 40 టీమ్‌లు పాల్గొన్నాయి. ఉదయం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రామ్ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పులిచెర్ల), ప్రైవేట్ పాఠశాలల విభాగంలో రెయిన్‌బో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ (చిత్తూరు) ప్రథమ స్థానాల్లో నిలిచాయి. ఈ జట్లు నవంబర్ 1, 2, 3 తేదీల్లో భీమవరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
పుస్తకావిష్కరణ, బహుమతుల ప్రదానం
జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ్ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్ బాబు రచించిన ప్రయోగాలతో శాసీ్త్రయ దృక్పథం పుస్తకాన్ని విఠపు బాలసుబ్రమణ్యం ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ అందజేశారు. అనంతరం ఎం.వి.కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విజేత పాఠశాలలకు మెమెంటోలు ప్రదానం చేశారు. విజయం విద్యాసంస్థల అధినేత శైలజ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఫిలింఫేర్ ఖాన్, పిల్లారప్ప, వేణుగోపాల్, విజయ్ కుమార్, జయంతి, సుధాకర్, గిరిధర్ మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


