బలిజకండ్రిగలో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు మాఫియాగా మారిన టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా తమిళనాడుకు తరలించి విక్రయాలు పట్టించుకోని అధికారులు
పాలసముద్రం : మండలంలోని బలిజకండ్రిగ సమీపంలోని గుట్టను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నారు. హిటాచీలతో తవ్వేసి భారీ టిప్పర్లలో తమిళనాడుకు తరలించేస్తున్నారు. పచ్చటి గుట్ట కరిగిపోతున్నప్పటికీ.. రూ.కోట్ల విలువైన మట్టి అక్రమంగా తరలిపోతున్నప్పటికీ అధికారులు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దోపిడీ కోసమే ధర్నా
మండలంలోని నరసింహాపురం, వనదుర్గాపురం, బలిజకండ్రిగ సమీపంలో మట్టి తవ్వకాల సాగుతున్నాయంటూ కొందరు టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఆ ప్రాంతం నుంచి గ్రావెల్ తరలింపును అడ్డుకున్నారు. అయితే అప్పటికే దాదాపు ఐదు, ఆరు గుట్టలు మాయమైపోయాయి. తర్వాత ఎర్రమట్టికి తమిళనాడులో మంచి గిరాకీ ఉందని కనిపెట్టిన అధికార పార్టీ బడా నేత రంగంలోకి దిగాడు. స్థానిక నాయకులను తన కనుసన్నల్లోకి తెచ్చుకుని మట్టి దోపిడీకి శ్రీకారం చుట్టేశాడు.
అడ్డుకుంటే.. బెదిరింపులు
కళ్లెదుటే పచ్చటి గుట్టలు కనుమరుగవుతుంటే స్థానిక రైతులు భరించలేకపోయారు. మా ప్రాంతంలో మట్టి తవ్వితే ఊరుకోమంటూ హిటాచీని, టిప్పర్లను మంగళవారం అడ్డుకున్నారు. అయితే అధికారం అండగా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా.. అన్నీ ఉన్నాయని బుకాయిస్తూ రైతులపై బెదిరింపులకు దిగారు. ఎప్పటిలాగే మట్టి తవ్వకం, అక్రమ రవాణాను కొనసాగించారు.
ఎప్పుడూ చూడలేదు
గతంలో ఈ స్థాయిలో మట్టి దోపిడీని చూడలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకా లు సాగిస్తోంది. వందలాది టిప్పర్లలో తమిళనాడుకి తరలిస్తోందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొద్దు నిద్రలో అధికారులు
ఎర్ర మట్టిని అక్రమంగా తవ్వి తమిళనాడుకు తీసుకెళ్లి అమ్మేస్తున్నా సంబంధిత శాఖల అధికారులు మొద్దు నిద్రలోనే ఉన్నారు. సామాన్య రైతులు తమ పొలాల్లోకి మట్టిని తరలించుకోవాలంటే మాత్రం అనుమతులు ఇవ్వడం లేదు. అదే అక్రమార్కులు ఎలాంటి అనుమతుల లేకపోయినా మట్టిని దోచుకుంటుంటే చూసీచూడనట్టు ఉంటున్నారని స్థానికులు మండిప డుతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి మట్టి మాఫియాకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.
మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్న స్థానిక రైతులు
మట్టిని తవ్వుతున్న హిటాచీ
అక్రమార్జనే లక్ష్యంగా టీడీపీ నేతలు
రెచ్చిపోతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేసేస్తున్నారు. అందులో భాగంగా పాలసముద్రం
మండలం బలిజకండ్రిగలోని పచ్చటి గుట్టను కబళిస్తున్నారు. యథేచ్ఛగా
ఎర్రమట్టిని తవ్వేసి తమిళనాడుకు
తరలించేస్తున్నారు. భారీ టిప్పర్లతో
ఇప్పటికే రూ.కోట్ల విలువైన గ్రావెల్‌ను కొల్లగొట్టేశారు. అధికార పార్టీ నేతలను అడ్డుకునేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కళ్లెదుటే
మట్టి దోపిడీ సాగుతున్నప్పటికీ
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.


