సామాన్యుడికి ధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడికి ధరాఘాతం

Aug 26 2026 12:24 AM | Updated on Aug 26 2026 12:24 AM

● కొండెక్కిన నిత్యావసర సరుకులు ● బియ్యం, పప్పులు, నూనెలు మరింత ప్రియం ● చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలపై రెండింతల భారం ● కుటుంబ పోషణకు భారీగా పెరిగిన వ్యయం ● రేట్ల నియంత్రణలో విఫలమైన యంత్రాంగం

● కొండెక్కిన నిత్యావసర సరుకులు ● బియ్యం, పప్పులు, నూనెలు మరింత ప్రియం ● చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలపై రెండింతల భారం ● కుటుంబ పోషణకు భారీగా పెరిగిన వ్యయం ● రేట్ల నియంత్రణలో విఫలమైన యంత్రాంగం

కాణిపాకం : జిల్లాలో 4.80 లక్షల మంది రేషన్‌ కార్డుదారులున్నారు. వీరిలో 50 నుంచి 60శాతం మంది చౌక బియ్యంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యంతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అయితే కంది పప్పు, ఇతరత్రా సరుకులపై సర్కారు కోత పెట్టడంతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. నెల క్రితం వరకు నిత్యావసర సరుకుల కోసం రూ. 2వేల నుంచి 3 వేల వరకు ఖర్చు అవుతుండేది. ప్రస్తుతం సరుకుల ధర ఆకాశాన్నంటడంతో మరింత భారం పడుతోందని సామాన్య ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

రెట్టింపైన బియ్యం ధరలు

రైతుల నుంచి ధాన్యం నిల్వలు మొత్తం వ్యాపారుల చేతిలోకి వెళ్లాయి. దీంతో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. 2024వ సంవత్సరం ఏప్రిల్‌ లో కర్నూలు సోనామసూరి బియ్యం కిలో ధర రూ.40 నుంచి రూ.42 మధ్య పలికింది. కొన్ని ప్రాంతాల్లో రూ.45 వరకు విక్రయించారు. ప్రస్తుతం బియ్యం ధర లు అమాంతం పెరిగిపోయాయి. కిలో బియ్యం కొనాలంటే రూ.70 నుంచి రూ.80 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్లలో కిలో సన్న బియ్యం రూ.52 చొప్పు న విక్రయిస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ ప్రకటించినా అన్ని చోట్లా అమలు కావడంలేదని ఆరోపిస్తున్నారు.

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి

సాధారణంగా ప్రతి వంటలోనూ ఉల్లిపాయలు తప్పనిసరి. పెరిగిన ధరలతో ఉల్లి వాడకం మానుకోవాల్సి వచ్చిందని, రెండు మూడు పాయలు వాడాల్సిన కూరలో ఒకటీ అర వాడి సరిపెడుతున్నామని మహిళలు వెల్లడిస్తున్నారు. 2024వ సంవత్సరంలో కిలో ఉల్లిపాయల ధర రూ.15 నుంచి రూ.18 మధ్య ఉండేది. నేడు అమాంతం పెరిగి రూ.55 నుంచి రూ.65 దాటింది. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో వివాహాల జోరు పెరిగింది. ఈ నెల చివరి వరకు వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసుకోవడానికి అనువైన ముహూర్తాలు ఉన్నాయి. దీంతో చాలా మంది శుభకార్యాలను తలపెట్టారు. అయితే పెరిగిన ధరలు భారంగా మారాయని వారు వాపోతున్నారు.

కాగుతున్న వంట నూనె

ఇతర నిత్యావసరాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. ప్యాకెట్‌ నూనెలే కాకుండా గానుగ ఆడిన స్వచ్ఛమైన వేరుశనగ నూనె కేజీ రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. సాధారణ పామాయిల్‌ లీటర్‌ రూ.160, వేరుశనగ ప్యాకెట్‌ నూనెలు లీటరు రూ.175 నుంచి రూ.195 వరకు ఉంది. ఇక పప్పు ధాన్యాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. నిత్యం వాడే కందిపప్పు కేజీ రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. పెసరపప్పు కేజీ రూ.180 పలుకుతుండగా, పచ్చిశనగపప్పు కేజీ ఏకంగా రూ.190కి చేరింది. ఎండుమిర్చి ధర అమాంతం పెరిగి కేజీ రూ.350 నుంచి రూ.400 వెచ్చించాల్సి వస్తోంది. పంచదార ధర రూ.68 నుంచి రూ.74 వరకు చేరింది.

పట్టించుకోని ప్రభుత్వం

ధరల పెరుగుదల భారీగా ఉన్నా, సామాన్యులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజానీకం మండిపడుతోంది. ధరలను అదుపు చేయాల్సిన పాలకులు చోద్యం చూడటం ఏంటని ప్రశ్నిస్తోంది. నిత్యావసరాల ధరలను అదుపు చేసేందుకు యత్నించకపోవడంపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement