చూతము రారండి..
విద్యుద్దీప కాంతుల్లో శ్రీకాళహస్తీశ్వరాలయం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. మూగజీవులు ముక్తి పొందిన దివ్యక్షేత్రంగా.. భక్తుల పాలిట భూకై లాసంగా.. శ్రీకాళహస్తి విరాజిల్లుతోంది. ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ విశేషోత్సవాలు మంగళవారం భక్త కన్నప్ప ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం కానున్నాయి. ఈశ్వరునిపై అచంచల భక్తి,విశ్వాసాలు చాటిన భక్త కన్నప్పకు తొలి పూజ నిర్వహించిన తరువాతే ఈ దివ్యోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఒక్కొక్క రోజును ఒక్కొక్క రాత్రిగా పరిగణిస్తూ ఉత్సవాలను జరపడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. స్వర్ణముఖి నది వంతెనపై నుంచి శ్రీకాళహస్తీశ్వరాలయం సోమ వారం రాత్రి శోభాయమానంగా దర్శనమిచ్చింది.
నేటి నుంచి మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు:
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీన భక్తకన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణ, 11న శ్రీకాళహస్తిశ్వరస్వామి ధ్వజారోహణం, వెండి అంబారి వాహనసేవ, 12న ఉదయం స్వామివారు సూర్యప్రభ అమ్మవారికి చప్పర వాహనసేవ, 13న ఉదయం హంస, యాళి వాహనసేవ, రాత్రి రావణ మయూర వాహనసేవ 14న ఉదయం హంస, శుక వాహనసేవ, రాత్రి శేష, యాళి వాహనసేవ, 15న మహాశివరాత్రి, ఉదయం ఇంద్ర విమానం, చప్పర సేవ, రాత్రి నంది సేవ, సింహ వాహనసేవ, 16న రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం జరగనుంది. 17న ఉదయం అధికార నంది, కామధేనువు, రాత్రి గజ, సింహవాహనసేవ, స్వామి అమ్మవార్ల కల్యాణోత్సం, 18న ఉదయం రుద్రాక్ష , అంబారి సేవ, రాత్రి సభావతి కల్యాణం, 19న అంబారి వాహనసేవ, రాత్రి ఆశ్వం, సింహ వాహన సేవ, 20న ధ్వజావరోహణం, 21న వల్లకీ సేవ, 22న ఏకాంత సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో నేడు
భక్తకన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణ (మాఘ బహుళ అష్టమి)
మధ్యాహ్నం 2.55గంటల నుంచి ప్రారంభం
ఉభయదాతలు శ్రీబోయ కులస్తుల వారి సంఘం, శ్రీకాళహస్తి.
చూతము రారండి..


