● కేసులు, రౌడీషీట్లు, పీడీ యాక్ట్‌లకు భయపడం ● ఏఐఎస్‌ఎఫ్
బాబు, లోకేశ్..
ఎన్నికల హామీలేమయ్యాయి?
చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడంలేదని ఏఐఎస్‌ఎఫ్, వైఎస్సార్ యూత్ ఫెడరేషన్ నాయకులు ప్రశ్నించారు. జిల్లా కేంద్రం చిత్తూరులో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన నేతలపై కేసులు బనాయించడం తగదన్నారు. ఏఐఎస్‌ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం, పీడీ యాక్ట్‌లు పెడుతామంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. మంత్రి లోకేశ్.. తస్మాత్ జాగ్రత్త అంటూ మండిపడ్డారు. విశాఖపట్టణంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీషీట్, రైతుసంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్‌లను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు రూ.6,400 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు, లోకేశ్ సమావేశాలు, పాదయాత్రలు నిర్వహించి ఇచ్చిన హామీలను ఇప్పుడు ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన నిలదీశారు. వైఎస్సార్ యూత్ ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా డిమాండ్ చేస్తున్న సంఘ నాయకులపై కేసులు బనాయించడం తగదని చెప్పారు. వారిపై కేసులు తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు శబరీష్‌రెడ్డి, వసంత్, చరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


