సంక్రాంతికి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సంక్రాంతి పండుగ పేరుతో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీటీసీ నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో ఈ నెల 5వ తేదీన సంక్రాంతికి ప్రైవేటు బాదుడు పేరిట వార్త వెలువడింది. దీనిపై రవాణాశాఖ అధికారు లు స్పందించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రైవేటు ట్రావెల్స్, కాంట్రాక్టు క్యారేజ్, బస్సు యజ మానులు, ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా ప్రకటించిన ప్రయాణ షెడ్యూల్‌ను ఎటువంటి కారణాలతోనైనా రద్దు చేయడం, వాయిదా వేయడం అనుచితమని.. అటువంటి చర్యలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి దారితీస్తాయన్నారు. వాహనాల అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌ను పూర్తిగా నిషేధించాలన్నారు. ప్రతి బస్సులో అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలన్నారు. ప్రయాణికు లు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సహాయం పొందేందుకు, ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ నంబరు 9281607001ను బస్సులో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రయాణికుల నుంచి అధికంగా, అనధికారికంగా చార్జీలు వసూలు చేయడం పూర్తిగా నిషేధమన్నారు. ఆర్టీసీ చార్జీలతో పోల్చి నిర్ణయించిన చార్జీలను మాత్రమే వసూలు చేయాలని, సంక్రాతి లాంటి పీక్ టైంలో గరిష్టంగా 1.5 రెట్లు మాత్రమే సర్జ్ చార్జీ అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికి మించి వసూలు చేసినట్లయితే సంబంధిత ఆపరేటర్లు, యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్టీఓ సునీల్, ఎంవీఐలు మురళి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతికి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు


