‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమర్, వైఎస్సార్ యూత్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి, వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి సద్ధాం డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నత విద్య చదివే విద్యార్థులను చులకనగా చూస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోతే ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. ఫీజులు చెల్లించుకోలేక చదువులు మానేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్ర బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీల ను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ యువగళం పాద యాత్రలో విద్యార్థులకు, యువతకు అనేక హామీ లు గుప్పించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చలేదన్నారు. 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు.
మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి
వైద్య విద్యను దూరం చేసేందుకే పీపీపీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం వెనుక ఉన్న కుట్ర ను మానుకోవాలన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఘాటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక రకాల విద్యారంగ సమస్యలు వేధిస్తున్నాయన్నారు. ఈ సమస్య లను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాలపై కేసులు పెట్టి బెదిరించడం తగదన్నారు. వెంటనే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యూత్ సంఘం నాయకులు గౌతమ్, అజిత్, శబరీష్‌రెడ్డి, జయంత్, లోకేష్, రాజు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, నాయకులు చరణ్, వసంత్ పాల్గొన్నారు.


