పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!
నిందితుడు డిజేబుల్
అంతర్జాతీయ క్రికెటర్
చిత్తూరులో వివరాలు వెల్లడించిన పోలీసులు
చిత్తూరు అర్బన్: బ్యాంకు ఉద్యోగం రావడం, తనకన్నా వయసులో 12 ఏళ్లు పెద్దదైన మహిళను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని గణేష్.. కవితను హత్య చేసినట్లు తేలింది. ఆమె కనిపించకుండాపోయిన రోజునే కవితను హతమార్చి నదిలో పడేశాడు. చిత్తూరులో కలకలం రేపిన దివ్యాంగురాలు కవిత (38) హత్య కేసులో నిందితుడు, ఆమె ప్రియుడు కావేరిపాకం గణేష్ (26)ను శుక్రవారం పోలీసులు అరెస్టు చూపించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య, ఎస్‌ఐ రమేష్‌తో కలిసి చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూ రు గిరింపేటకు చెందిన కవిత, ఎస్‌ఆర్.పురంలోని బసిరెడ్డిపల్లెకు చెందిన గణేష్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పలుమార్లు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా గణేష్ నిరాకరిస్తుండడంతో కవిత పోలీసుల వద్దకు వెళ్లడం.. దివ్యాంగుల జేఏసీ నేతల మధ్య పెళ్లి చేసుకుంటామని చెప్పి రాజీ చేసుకుని వెళ్లేవా రు. ఈ క్రమంలో ఆర్నెళ్ల క్రితం గణేష్‌కు ఎస్ బీఐలో ఉద్యోగం రావడంతో కవితను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ కవిత నుంచి ఒత్తిడి పెరిగడంతో ఈనెల 31న పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిన కవిత, తన వాహనాన్ని నాయుడు బిల్డింగ్స్ వద్ద పార్కింగ్‌చేసి.. ఓ ఆటోలో గంగాధరనెల్లూరు సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. ఆపై గణేష్ తన స్కూటర్‌లో వచ్చి, ఆమెను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. వివాహ విషయమై మళ్లీ ఇద్దరికీ వాద నలు ప్రారంభమవడంతో పెళ్లి చేసకుంటామ ని చెప్పి, స్కూటర్‌లో ఎక్కించుకుని ఆమె తలను స్కూటర్ ముందు భాగంలోని ఇనుప డోర్‌కు కొట్టి చంపేశాడు. బ్రిడ్జిపై నుంచి మృతదేహాన్ని నీవా నదిలో పడేసి వెళ్లిపోయాడు.
నిర్లక్ష్యంగా చూడలేము
ఈ ఘటనలో కవిత తనకు ప్రాణహాని ఉందని జేఏసీ నేతకు పంపిన వాయిస్ మెసేజ్ సకాలంలో చూసుకోకపోవడంతో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుగా వన్‌టౌన్‌కు వెళ్లడం.. ఇది తమ పరిధి కాదనడం, ఆపై టూటౌన్‌కు వెళ్లినా ఇదే సమాధానం వచ్చింది. తీరా కవిత గిరింపేట నుంచి వెళ్లినట్టు గుర్తించి సీఐ కేసు నమోదు చేశారు. కవిత కనిపించకుండాపోయిన రోజునే హత్యకు గురవడంతో . స్టేషన్ పరిధిపై తిప్పి పంపడాన్ని పోలీసుల నిర్లక్ష్యంగా చూడలేమని డీఎస్పీ పేర్కొన్నారు. కవిత ఫోన్ సిగ్నల్ తమిళనాడులోని ఆరణి ప్రాంతంగా చూపిస్తోందని, ఇంకా రికవరీ చేయలేదన్నారు.
దివ్యాంగురాలు కవిత హత్య కేసులో గణేష్ అరెస్ట్
నిందితుడు గణేష్ విద్యాపరంగా ప్రతిభావంతుడు. పదో తరగతిలో మంచి మార్కు లు సాధించిన ఇతను కడప ఐఐఐటీ, ఆపై జేఈఈ అడ్వాన్స్డ్ రాసి తిరుచనాపల్లె ఎన్‌ఐటీలో బీ.టెక్ పూర్తి చేశాడు. ఆపై సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్‌లో రెండు మార్కుల్లో వెనకబడ్డాడు. క్రికెట్‌పై పట్టు ఉన్న ఇతను రాష్ట్ర క్రీడాకారుడిగా, 2021లో డిజేబుల్ ఐపీఎల్ రాజస్థాన్ రాజ్‌వాడ్స్ టీమ్‌లోనూ ఆడాడు. 2023లో ఇండియా–నేపాల్ అంతర్జాతీయ డిజేబుల్ క్రికెట్‌లోనే ఆడాడు. ఈ కోటాలోనే బ్యాంకు ఉద్యోగం కూడా వచ్చింది. కవితను వదిలించుకోవాలనే విషయంలో అతితెలివి ప్రదర్శించాడు. ఆమెను హత్య చేసిన రోజు గణేష్ తన మొబైల్‌ను బ్యాంకులోనే ఉంచేశాడు. హత్యానంతరం మృతదేహాన్ని బురదలో వేస్తే దుర్గంధం రాదని అక్కడే పడేశాడు. తరువాత కవిత మొబైల్‌ను ఓ లారీలో పడేసి.. మరుసటి రోజు తాను కూడా ఆమెను వెతుకుతున్నట్లు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. తీరా కవిత మృతదేహం బయటపడడంతో గణేష్ పాచికలు పారలేదు.
కవిత హత్యపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలు కవిత హత్య కేసులో పోలీసు నిర్లక్ష్యమే కారణమంటూ న్యాయవాది అర్షద్ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్ ఎస్‌హెచ్‌వోను బాధ్యులుగా చేస్తూ ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ మానవహక్కుల సంఘానికి సైతం అర్హద్ ఫిర్యాదు చేశారు.


