వాడికి మనసెలా వచ్చిందో?
కవితకు న్యాయం చేయాలని రోడ్డెక్కిన దివ్యాంగులు చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి ముట్టడి హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ‘మా బిడ్డను ఎలా చంపాడో.. వాడికి ఎలా మనసొచ్చిందో.. వాడ్ని వెంటనే అరెస్టు చేయాలి..?’ అంటూ మృతురాలు కవిత తల్లి పోలీసుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. దివ్యాంగురాలు కవిత హత్యపై దివ్యాంగుల సంఘ నేతలు, సభ్యులు గురువారం రోడెక్కారు. చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నినదాలతో హోరెత్తించారు. దీంతో అర్థగంట పాటు రాకపోకలు స్తంభించాయి. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు. హత్య చేసిన వ్యక్తులను వదిలిపెట్టబోమని పోలీసులు వారికి సర్దిచెప్పారు. ఇంతలో బాధిత కుటుంబీకులు ఆగ్రహానికి గురయ్యారు. చంపేసిన తర్వాత న్యాయం చేస్తారా..? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు అత్యవసర కేసులు ఆస్పత్రికి రావడంతో దివ్యాంగులు ధర్నా నుంచి తప్పు కున్నారు. ఆపై అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. అర్ధగంట పాటు నినాదాలు చేశారు. తర్వా త వికలాంగుల హక్కుల చట్టం అమలు జిల్లా కమి టీ సభ్యులు చంద్రశేఖర్, మురళి మాట్లాడుతూ చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన కవిత దారుణ హత్యకు గురైందన్నారు. ఈ నెల 31న అదృశ్యమైన కవిత బుధవారం జీడీనెల్లూరు వద్ద నీవానదిలో శవమై తేలిందన్నారు. ఈ హత్యకు కారకులైనా వారి ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఇక్కడి నుంచి కదిలేదిలేదన్నారు. కవిత అదృశ్యంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులకు రెండు రోజుల సమయం పట్టింది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళితే.. టూటౌన్‌కు వెళ్లామని తిప్పించుకున్నారు. డీఎస్పీని కూడా కలిశామన్నారు. ఇంతలోనే ఆమె హత్యకు గురై.. శవమై కనిపించడం బాధకరమన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టంపై పాలకులు దృష్టిసారించాలన్నారు. జీరో ఎఫ్‌ఐ కట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో లీలాపతినాయుడు, ఏకాంబరం, మురళిగౌడ్, సుబ్రమణ్యం, కాంచన, మాధవి, సుబ్బమ్మ, గజేంద్రన్, చిట్టిబాబు, గోపి, దొరబాబు, హరికృష్ణ, రామానాయుడు, రామ కృష్ణ, శివకుమారి, శివకుమార్ పాల్గొన్నారు.
వాడికి మనసెలా వచ్చిందో?


