● జిల్లాలో విచ్చలవిడిగా అబార్షన్లు ● మార్కెట్లో జోరుగా
కాణిపాకం: జిల్లాలో 1,200 పైగా ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. 2 వేల వరకు ఆర్‌ఎంపీ, నకిలీ వైద్యులున్నారు. వీరిలో చాలామంది వైద్య చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ఇష్టానుసారంగా నాడిపట్టి వైద్యం చేస్తున్నారు. స్కానింగ్‌లో ఆడ, మగ నిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తున్నారు. దీనికి చిత్తూరు జిల్లా కేంద్రం అడ్డగా మారింది. అలాగే గంగాధరనెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. ఇక్కడికి కర్ణాటక, తమిళనాడు నుంచి అధికంగా వస్తున్నారు.
నకిలీ తంత్రం
గర్భిణులు మొదటి కాన్పులో ఆడబిడ్డ పుడితే.. రెండో బిడ్డ మగ బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది.. ఏ బిడ్డో తెలుసుకోవాలని చాలా మంది తహతహలాడిపోతుంటారు. ఇందుకు ఖర్చుకు వెనకాడకుండా అక్రమ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆడబిడ్డగా నిర్థారణ అయితే వెంటనే అబార్షన్‌కు సిద్ధపడిపోతున్నారు. ఈ అబార్షన్లను కొందరు ఆర్‌ఎంపీలు, నకిలీ వైద్యులు అవకాశంగా మార్చుకుంటున్నారు. రూ.20వేలు తీసుకుని అబార్షన్లు చేసి పంపుతున్నారు. పెళ్లి కాకుండానే గర్భవతులవుతున్న వారికి అబార్షన్లు చేయాలంటే రూ.30వేల వరకు ఫీజు గుంజుతున్నారు. ఈ అబార్షన్లకు క్షేత్ర స్థాయిలోని కొందరు ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, ఆర్‌ఎంపీల వద్ద పనిచేసే కొందరి సహకారం పుష్కలంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఆడిట్ ఎక్కడా?
అబార్షన్లకు సంబంధించి ఏటా ఆడిట్ జరగాలనే నిబంధన ఉంది. అయితే ఆ రకంగా జిల్లాలో జరగడం లేదు. ఇటీవల జరిగిన ఓ సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు గుచ్చి గుచ్చి చెప్పారు. కానీ ఆ రకంగా అధికారుల్లో కదలికలు కనిపించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత మందికి అబార్షన్ చేశారు.? ఎందుకు చేశారు? అనే విషయాలను ఆరా తీయాల్సి ఉంది. ఇక కొన్ని ఆస్పత్రుల్లో అబార్షన్లు చేసి వాటిని రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. కానీ ఆ వివరాలు శుద్ధ అబద్ధమని వైద్యశాఖలోని పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు.
ఎంటీపీకి కిట్స్ ఎక్కడివి?
స్పందించని అధికారులు
జిల్లాలో ఇష్టానుసారంగా అబార్షన్లు జరుగుతున్న అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్కానింగ్ సెంటర్లపై తనిఖీ చేస్తున్న పీసీపీఎన్‌డీటీ అధికారుల కాళ్లను కట్టిపడేశారు. కుర్చీలకు అతుక్కుపోవాలని ఆదేశాలిచ్చారు. దీంతో అబార్షన్ల అనకొండలు హద్దు మీరుతున్నాయి. విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తూ కడుపులోని పిండాన్ని చిదిమేస్తున్నాయి. ఇలానే వదిలేస్తే ఆడ పిల్లల నిష్పత్తి తగ్గిపోతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారో.. లేదో వేచి చూడాలి మరి.
పెరుగుతున్న అబార్షన్ల సంఖ్య
జిల్లా వ్యాప్తంగా 2024–25లో 32,534 మంది గర్భిణులు నమోదయ్యారు. వీటిలో తొలి గర్భవతులు 12,129, రెండు..అంతకంటే ఎక్కువ గర్భవతులు 20,405గా గుర్తించారు. ఈ కాలంలో 1,691 మంది అబార్షన్ అయ్యారు. 2025–26 (ఏఫ్రిల్ నుంచి డిసెంబర్) 20,824 మంది గర్భిణులుగా లెక్కల్లోకి ఎక్కారు. మొదటి గర్భవతులు 8,007, రెండో సారి.. అంతకంటే ఎక్కువ గర్భవతులు 12,816 మందిగా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు 1,016 మంది అబార్షన్లు చేసుకున్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, జీడీనెల్లూరు నియోజవర్గాల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో ఏఎన్‌ఎంలు గుర్తించినవి మాత్రేమే. దొంగ చాటుగా జరుగుతున్న అబార్షన్లు లెక్కల్లోకి రావడం లేదని అధికారులు అంటున్నారు.
అబార్షన్ కిట్లు(ఎంటీపీ) విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. మెడికల్ షాపులు, ఆర్‌ఎంపీ, నకిలీ వైద్యుల వద్ద కూడా ఈ కిట్లు తేలికగా దొరికుతున్నాయి. వీరికి పలు మెడికల్ ఏజెన్సీల ద్వారా సరఫరా అవుతున్నట్టు ఆ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. గైనిక్ డాక్టర్ చీటీ లేకుండా ఎంటీపీ కిట్లను మెడికల్ షాపు నిర్వాహకులు విక్రయించకూడదు. కానీ కిట్లు విచ్చలవిడిగా లభ్యం కావడంతో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు జరిగిపోతున్నాయి. కిట్ల అమ్మకంపై నిఘా పెట్టాల్సిన జిల్లా జౌషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
● జిల్లాలో విచ్చలవిడిగా అబార్షన్లు ● మార్కెట్లో జోరుగా


