దేవుడు కనిపించాడు!
దివ్యదర్శన టోకెన్ల క్యూలలో తోపులాట
ఆ నగుమోమును చూడాలని.. నిలువెత్తు మూర్తిని దర్శించుకోవాలని.. ఆ అమృతమూర్తిని కనులారా వీక్షించాలని వారంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరునగరికి చేరుకున్నారు. అయితే వారికి ఏడుకొండల వాడి పాదాల చెంతన ఉన్న అలిపిరిలోనే ఆ దేవదేవుడు కనిపించాడు. తోపులాటలో చిన్నా, పెద్దా, వయోవృద్ధులు వర్ణించనలవికానీ అగచాట్లు పడ్డారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో తండ్రీ నిను చూడాలని వచ్చిన మాకు ఇన్ని ఇక్కట్లా అని ఆవేదన చెందారు. పండుగ సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం గురువారం తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌కు భక్తులు అత్యధిక సంఖ్యలో చేరుకున్న దర్శన టోకెన్ల కోసం అష్టకష్టాలు పడ్డారు. నిర్దేశించిన లక్ష్యం కంటే మించి రెండింతల మేరకు భక్త జనం చేరుకోవడంతో క్యూలన్నీ కిక్కిరిసి పోయాయి. దివ్యదర్శన టోకెన్ జారీ కౌంటర్ వద్ద భక్తులు పోటెత్తడంతో నిలువరించే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది చర్యలు ఏమాత్రం ఫలించలేదు. భక్తులు టోకెన్ల కోసం ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాటలు చోటుచేసుకుని అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కంచెలను దాటే ప్రయత్నంలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తుల రద్దీ ఏ మాత్రం దగ్గలేదు. నిర్దేశించిన మేరకు టోకెన్ల జారీ పూర్తి అయిందనే విషయం తెలుసుకున్న పలువురు భక్తులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ నిరుత్సాహంగా ఊసురోమంటూ వెనుదిరిగారు. కాగా ఈ ఘటన చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి ఫొటో గ్రాఫర్ కెమెరాను ఏవీఎస్‌ఓ లాక్కున్నారు. – తిరుపతి అన్నమయ్యసర్కిల్


