ఉపాధిలో వేతన వెతలు
నాలుగు నెలలుగా అందని జీతాలు
అవస్థల్లో కూలీలు
జిల్లాలో రూ.39.84 కోట్ల మేర బకాయిలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉపాధి కూలీల అవస్థలు అన్నీఇన్నీ కావు. నాలుగు నెలలుగా వేతనాలు, కూలీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించి 15 రోజుల్లో జీతాలు అందించేలా చట్టం ఉన్న ప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూలీలకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆగస్టు 15 నుంచి అందని జీతాలు
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉపాధి కూలీలు పస్తులుండాల్సి వస్తోంది. చంద్రబాబు సర్కారు ఉపాధి కూలీల పట్ల చిన్నచూపు చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఉపాధి కూలీలకు జీతాలు అందడం లేదు.
పేరుకుపోయిన బకాయిలు
జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల జీతాలు రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఇందుకు కారణం కేంద్రమేనని, బడ్జెట్ విడుదల చేయడం లేదని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జీతాలు రాకపోవడంతో ఉపాధి కూలీలు వలస బాట పట్టారు. రామకుప్పం, ఐరాల, పూతలపట్టు మండలాల్లో యంత్రాలతో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్ని చోట్ల కూలీలకు అందాల్సిన నిధులు రానివ్వకుండా నొక్కేసేందుకు పచ్చ నేతలు యంత్రాలతో పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది.
నత్తనడకన ఉపాధి పనులు
గ్రామాల అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తున్నామని డప్పు కొంట్టుకుంటున్న చంద్రబాబు సర్కారు క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు. డ్వామా శాఖ పరిధిలో ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు మొత్తం 62,848 పనులు మంజూరు చేశారు. అయితే వీటిలో 17,788 మాత్రమే పూర్తి చేయగలిగారు. ఫీడర్ చానళ్ల పూడిక తీతకు 3,422 పనులను మంజూరు చేయ గా 324 మాత్రమే పూర్తి చేశారు. జిల్లాలో 23,583 ఫామ్‌పాండ్స్ పనులను మంజూరు చేయగా ఇప్పటి వరకు 6,678 పూర్తి చేసి మిగిలినవి నిలిపివేశారు. ఆర్భాటంగా నిర్వహించిన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2,395 పశువుల పాకలు మంజూరు చేయగా ఇందులో 682 మాత్రమే పూర్తి చేశారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు 6,678 మంజూరు చేయగా 2,283, కంపోస్ట్ గుంతలు 9,791కి 4,769, పశువుల తొట్టెలు 1,788కి గాను 761 పూర్తి చేసి మిగిలిన పనులను నిలిపివేశారు. గ్రామీణ రహదారుల అభివృద్ధిలో జిల్లా వ్యాప్తంగా 1,434 సీసీ రోడ్లను మంజూరు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 127 రోడ్లు మాత్రమే వేయగలిగారు.


