డెమో డమ్మీ?
స్కానింగ్ సెంటర్ల పర్యవేక్షణ శూన్యం డెకాయ్ ఆపరేషన్ నిల్ పర్యవేక్షించే అధికారులకు తప్పని చీవాట్లు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో డెమో విభాగం డమ్మీ అవుతోంది. స్కానింగ్ సెంటర్ల పర్యవేక్షణను విస్మరించింది. డెకాయ్ ఆఫరేషన్‌ను గాలికొదిలేసింది. సెంటర్ నిర్వాహకులతో కుమ్మకై బాధ్యతలను పట్టించుకోకుండా పోయింది. ఓ అధికారి పర్యవేక్షణకు వెళ్లొద్దని హుక్కుం జారీ చేయడంతో ఆె విభాగానికి జ్వరమొచ్చింది. కార్యాలయానికి అతుక్కుపోయి.. విధులను పట్టాలెక్కించింది. తీరా కలెక్టర్ ఆదేశించినా.. డెకాయ్ ఆఫరేషన్‌కు ముందడుగు పడనంటోంది. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డెమో విభాగం ఉంది. ఈ విభాగంలో పీసీపీఎన్‌డీటీ నోడల్ ఆఫీసర్‌తో పాటు ఐదుగురు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షించడం, డెకాయ్ ఆఫరేషన్ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా వారు పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
కన్నెత్తి చూడం!
జిల్లాలో 700పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో చాలావరకు నియమనిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నా.. కొన్ని అక్రమాలకు పదును పెడుతున్నాయి. ఒక దానికి అనుమతి తీసుకుని మరో మిషన్ పెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పాత బడిన మిషన్లను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయించేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. దేవుళ్ల బొమ్మలను చూపించి లింగాలను బయటపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా ఈ దందా జోరుగా నడుస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు ఆ శాఖలోని పలువురి సహకారం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వీరు స్కానింగ్ గుట్టు బయటకు పొక్కకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొందరు అధికారులు మండిపడుతున్నారు. అక్రమంగా వెలిసిన స్కానింగ్ సెంటర్లకు కూడా కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో డెమో విభాగం మూగబోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుర్చీలకు అతుక్కుపోయారు!
అక్రమ స్కానింగ్ సెంటర్ల ఆట కట్టించాల్సిన అసలైనా అధికారులు కుర్చీలకు అతుక్కుపోయారు. బయటకు కదలకుండా పీసీపీఎన్‌డీటీ నోడల్ ఆఫీసర్‌కు సంకెళ్లు పడేశారు. గుడిపాల మండలం బొమ్మసముద్రంలో జరిగిన ఓ అబార్షన్‌పై ఆ అధికారి తోటపాళ్యంలోని ఓ స్కానింగ్ సెంటర్‌పై తనిఖీ చేశారు. తనిఖీ చేసినందుకు అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. తనకు తెలియకుండా ఎలా తనిఖీ చేస్తావంటూ ఓ పెద్ద స్థాయి అధికారి చురకలు పెట్టడం గమనార్హం. దీంతో స్కానింగ్ సెంటర్ల పర్యవేక్షణ గాడితప్పింది. అప్పటి నుంచి అడ్డదిడ్డమైన స్కానింగ్లు, అబార్షన్లు జరుగుతున్నా డెమో విభాగం మిన్నకుండిపోతోంది. కలెక్టర్ ఆదేశించినా డెకాయ్ ఆఫరేషన్ వైపు శాఖ కదలడం లేదు. ఆ విభాగానికి సంబంధించిన ఒకరిద్దరూ అధికారులను కదిలిస్తే.. మాకు ఎందుకొచ్చిన తంట.. అని వెనకడుగు వేస్తున్నారు. స్కానింగ్ సెంటర్లపై తనిఖీ చేస్తే.. ఆ అధికారి నుంచి ఇబ్బందులు తప్పవని భయపడుతున్నారు.
ఆరోపణలు ఇలా..
జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై పూర్తిగా నిఘా కొరవడుతోంది. అసలు ఆ సెంటర్లను పట్టించుకునే వారే కరువయ్యారు. కొందరు వసూళ్ల మత్తులో పడి తనిఖీచేయడం లేదని అంటున్నారు. ఆ శాఖలో ఓ సిబ్బంది దళారీగా వ్యవహరించి.. వసూళ్ల పర్వాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం. ఒక వేళ తనిఖీకి వెళ్లినా ముందస్తు సమాచారం ఇచ్చేస్తూ.. కంటికి రెప్పలా కాపాడుతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది.
జిల్లాలో అధ్వాన్నంగా డెమో విభాగం


