కాకినాడ టూ శబరిమల!
నగరి : కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కి.మీ పాదయాత్ర చేసి అయప్ప స్వామివారిని దర్శించుకోవడం వారి భక్తి పారవశ్యాన్ని చాటిచెబుతోంది. తూర్పుగోదావరి జిల్లా, తణుకు మండలం, మండపాకం గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ, రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానీశంకర్ (44) 18 ఏళ్ల నుంచి తమ యాత్రలను కొనసాగిస్తున్నారు. అర్జున్‌స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవానీశంకర్ కన్నిస్వామిగా మాలధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. ఇరువురూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఏడాది మళ్లీ ఇద్దరూ కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీశంకర్ 18వ సారి, అర్జున్ స్వామి 36వ సారి యాత్రను కొనసాగించారు. వారి పాదయాత్ర శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భవానీశంకర్ నవంబర్ 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్‌స్వామి డిసెంబర్ 4న తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు వివరించారు.


