పాఠశాల స్థలం కబ్జా చేసిన జనసేన నేత
తిరుపతి కల్చరల్: ప్రాథమిక పాఠశాల స్థలాన్ని దౌర్జన్యంగా కబ్జా చేసి దగా చేస్తున్న జనసేన నేత తులసీ ప్రసాద్‌పై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఐరాల మండపం, దివిటివారి పల్లెకు చెందిన మునికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా, ఐరాల మండలంలోని దివిటివారిపల్లెలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన కొంత స్థలంలో వాటర్ ప్లాంట్ పేరుతో 2017లో జనసేన నేత తులసీప్రసాద్ ఒక భవనం కట్టాడన్నారు. ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పడంతో వారు పనులు అడ్డుకున్నట్టు తెలిపారు. ఆపై అతడు టీడీపీ కార్యర్త సహాయంతో భవనం నిర్మించాడన్నారు. గత వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో పాఠశాల స్థలంలో ఎలాంటి భవనానలు నిర్మాణం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అప్పటి గ్రామ సర్పంచ్ పాఠశాలకు స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వారిని కలిసి 2023 సెప్టంబర్ 17న భవనాన్ని కూల్చివేశారని తెలిపారు. దీంతో పగ పెంచుకున్న తులసీ ప్రసాద్ కోర్టులో కేసు వేసి పాఠశాల స్థలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా వచ్చిన నిధులు సైతం వినియోగించకుండా కబ్జాదారుడు అడ్డుకున్నాడన్నారు. అక్టోబర్‌లో అతడు తన మనుషులతో వచ్చి పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, అతని దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు కట్టలేదన్నారు. తహసీల్దార్‌కు చెప్పినా రాజకీయ ఒత్తిడితో స్పందించలేదని వాపోయారు. పాఠశాల ఆక్రమణపై జిల్లా ప్రభుత్వ అధికారులు స్పందించి తగు విచారణ చేసి పాఠశాల స్థల ఆక్రమణదాడిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


