కొండెక్కిన కోడిగుడ్డు!
పలమనేరు: ఉన్నట్టుండి కోడిగుడ్ల ధర పెరగడంతో సామాన్యులపై ధరాభారం తప్పడం లేదు. గత నెలలో గుడ్లు హోల్‌సేల్‌గా ఒకటి రూ.6 దాకా ఉండగా ఇప్పుడు రూ.7.3 పైసలకు చేరింది. రిటైల్‌లో రూ.8 దాటింది. జిల్లాలో ఫౌల్ట్రి ఉత్పత్తులు తగ్గడమేగాక బయటి రాష్ట్రాల నుంచి గుడ్ల సరఫరా భారీగా తగ్గుముఖం పట్టడం, ఇదే సమయంలో ఇక్కడి నుంచి బయటి దేశాలకు పెరిగిన ఎగుమతులతోనే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
తమిళనాడులో భారీగా తగ్గిన ఉత్పత్తి
జిల్లాకు మన ఉత్పత్తులతోపాటు తమిళనాడు నుంచి ఎక్కువగా గుడ్లు వచ్చేవి. అయితే ప్రస్తుతం జిల్లాలో సరాసరి గుడ్ల ఉత్పత్తి 50 నుంచి 60 శాతం దాకా తగ్గింది. దీనికి తోడు తమిళనాడు నుంచి దిగుమతులు పూర్తిగా తగ్గాయి. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణకు తమిళనాడు నుంచి అధికంగా గుడ్లు వెళ్తున్నాయి. దీంతో జిల్లాకు అక్కడి వ్యాపారులు ఓ గుడ్డు రూ.6 ఖర్చవుతోందని, దీన్ని ఇక్కడికి తరలించేందుకు రవాణా చార్జీలతో కలిపి విక్రయిస్తుండడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో స్థానికంగానూ ఉత్పత్తులు లేక ఈ పరిస్థితి నెలకొందని ఫౌల్ట్రీ రైతులు అంటున్నారు.
నాణ్యమై గుడ్లు అనుమానమే!
పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీలకు నాణ్యమైన గుడ్లు అందడం గగనమేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పేపర్ రేట్ మేరకు గుడ్ల కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులిస్తుంది. కానీ సంబంధిత కాంట్రాక్టర్లు చిన్నసైజు గుడ్లను దింపడం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రజలు సైతం పోష్టికాహారం కోసం గడ్లు కొనడం ఎక్కువైంది. బేకరీల్లో ఎక్కువగా గుడ్ల వినియోగం ఉంటుంది. డిమాండ్‌కు సరిపడా సరుకు లేక ధరలు భారీగా పెరిగినట్టు సమాచారం.


