
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని పలువురు నిపుణులు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారిలో మహిళలే ఎక్కువ ఉన్నారని ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్‌షాట్ 2025' నివేదికలో వెల్లడించింది.
ఏఐ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 శాతం మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు. ఈ ప్రమాదంలో పడే పురుష ఉద్యోగులు 21 శాతం మాత్రమే అని ఐక్యరాజ్యసమితి నివేదించింది.
తప్పుల నుంచి నేర్చుకోకపోతే..
ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్‌షాట్ 2025' (Gender Snapshot 2025) నివేదిక.. ప్రస్తుత అసమానతలను కూడా హైలైట్ చేసింది. ప్రపంచ టెక్ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు 29%, టెక్ లీడర్‌లలో కేవలం 14% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ప్రపంచం కొత్త అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. మనం గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకోకపోతే.. భవిష్యత్తులో అసమానత మరింత ఎక్కువవుతాయని హెచ్చరించింది.
జెండర్ అంతరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ''ఇది 343 మిలియన్ల మహిళలకు, బాలికలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 30 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటపడేస్తుంది, 42 మిలియన్లకు ఆహార భద్రతను మెరుగుపరుస్తుంది. 2030 నాటికి ప్రపంచ వృద్ధిలో 1.5 ట్రిలియన్ డాలర్లకు దారితీస్తుందని నివేదికలో హైలైట్ చేసింది''.
మహిళలు శ్రామిక శక్తిలో చేరడానికి.. విద్య, కెరీర్స్, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సహాయం చేయడంలో అనేక దేశాలు నిజమైన పురోగతి సాధించాయి. సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి.. సంరక్షణ సంబంధిత అడ్డంకులను తగ్గించడానికి చట్టపరమైన & విధాన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఫలితంగా, మహిళల భాగస్వామ్యం రెండింతలు పెరిగి, 2017లో 17 శాతం నుంచి 2024 మూడవ త్రైమాసికం నాటికి 35.4 శాతానికి పెరిగింది.
ఇదీ చదవండి: తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు