
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు, సీఈఓ 'శ్రీధర్ వెంబు' స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
''విభజన సమయంలో అన్నీ వదిలి భారతదేశానికి ఎలా రావాల్సి వచ్చిందో.. సింధీ స్నేహితుల నుంచి నేను చాలా విషయాలను విన్నాను. వారు తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్నారు. సింధీలు భారతదేశంలో బాగానే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో.. హెచ్1బీ వీసాపై ఉన్న భారతీయుల వంతు వచ్చింది. చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ.. మన దేశానికి తిరిగి వచ్చేయండి. మీ జీవితాలను మళ్లీ పునర్నిర్మించుకోవడానికి ఐదేళ్ల కాలం పట్టవచ్చు. కానీ అది మిమ్మల్ని బలపరుస్తుంది. భయంతో జీవించవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. మీరు బాగానే ఉంటారు'' అని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
I have heard so many accounts from Sindhi friends about how their families had to leave everything and come to India during partition. They rebuilt their lives and Sindhis have done well in India.
I am sad to say this, but for Indians on an H1-B visa in America, this may be that…— Sridhar Vembu (@svembu) September 21, 2025
శ్రీధర్ వెంబు పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ''వాస్తవాలు తెలియకుండా భయాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసాలో ఉన్న వ్యక్తులకు కొత్త నియమాలు వర్తించవు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త నియమాలు కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకు మాత్రమే'' అని ఒక యూజర్ పేర్కొన్నారు. బెంగాలీలు, పంజాబీల నుంచి మీరు చాలా విషయాలను విని ఉండవచ్చు. కానీ వారు ఇప్పుడు ఉన్న స్థితికి చేరుకోవడానికి దాదాపు మూడు తరాలు పట్టింది. ఇది అంత సులభం కాదని ఇంకొకరు అన్నారు.
ఇలాంటి సవాళ్లు అప్పుడప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వదేశానికి తిరిగి వచ్చి, జీవితాలను పునర్నిర్మించుకోవడానికి చాలా కృషి అవసరం. కానీ భారతదేశంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ధైర్యం, పట్టుదలతో, అభివృద్ధి చెందవచ్చని.. మరో యూజర్ శ్రీధర్ వెంబు మాటలతో ఏకీభవించారు.