
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, ట్రంప్ సుంకాలు వంటి అంశాలు బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 1,13,070 వద్దకు చేరింది. అయితే ఈ ధర ఐదేళ్లకు ముందు.. 2020లో రూ. 51,000 మాత్రమే అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు ఎంతలా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
బంగారం ధర ఐదేళ్లలో (2020 - 2025 మధ్య) డబుల్ అయింది. గోల్డ్ డిమాండ్ తగ్గే సూచనలు కనిపించకపోవడంతో.. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇది రూ. 2 లక్షలకు చేరుకుంటుందా?, దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బంగారంపై పెట్టుబడులు ఎక్కువ కావడం.. గోల్డ్ రేటు పెరుగుదలకు కారణమవుతోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని.. బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఈటీఎఫ్ రూపంలో బంగారం డిమాండ్ పెరుగుతుందని ట్రేడ్‌జీనీ సీఓఓ త్రివేష్ పేర్కొన్నారు.
సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ డాలర్ ధర, ద్రవ్యోల్బణం వంటివన్నీ కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడతాయని ఇన్‌క్రెడ్ మనీ సీఈఓ విజయ్ కుప్పా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బంగారం ధర పెరిగినా.. డిమాండ్ తగ్గదు!
ఇప్పుడు రూ.1,13,070 వద్ద ఉన్న 10 గ్రామ్స్ గోల్డ్ రేటు.. మరో ఐదేళ్లలో రూ. 1.70 లక్షల నుంచి రూ. 2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. కారణాలు ఎన్ని ఉన్నా.. 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4000 డాలర్లు దాటవచ్చని చెబుతున్నారు. దీంతో భారతదేశంలో కూడా పసిడి ధర గణనీయంగా పెరుగుతుంది.