ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు | Why Tesla Shares Took A Historic Hit Plunging 14 Percent In A Single Day, Know Reasons Inside | Sakshi
Sakshi News home page

ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు

Jun 6 2025 8:34 AM | Updated on Jun 6 2025 10:14 AM

why Tesla shares took a historic hit plunging 14 Percent in a single day

ట్రంప్‌-మస్క్‌ మధ్య ముదురుతున్న విభేదాలు

ఎలాన్‌ మస్క్‌ సారథ్యం వహిస్తున్న టెస్లా షేరు విలువ కుప్పకూలింది. గురువారం ఒక్కరోజే 14 శాతం పడిపోయి 150 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి ఈ షేరు భారీగా క్షీణించింది. ఈ కంపెనీకి సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగ విభేదాలే ఇలా టెస్లా షేరు విలువ పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పెరిగిన షేరు ధర ఇద్దరి మధ్య వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వస్తున్న వరుస కథనాలకు భారీగా కుప్పకూలుతోంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయి 916 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది.

ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తాం..

ఇటీవల బహిరంగంగా మస్క్‌, ట్రంప్‌ మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్‌ను ఎదుర్కోవడం కష్టంగా మారిందని, ఆయన అతిగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.

ఈవీ క్రెడిట్లు లేకపోవడంపై అసంతృప్తి

ఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలాన్‌కు నాకు మంచి అనుబంధం ఉంది. ఇకపై కలిసి పని చేస్తామో లేదో తెలియదు. (ఇటీవల డోజ్‌ నుంచి మస్క్‌ వైదొలిగారు) ట్రంప్‌ ఇటీవలి చర్యలకు నేను ఆశ్చర్యపోయాను’ అంటూ కొత్త బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) క్రెడిట్లు లేకపోవడంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందం

భవిష్యత్తు ఎన్నికల్లో సవాళ్లు

ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతుండగా మస్క్ వెంటనే ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో స్పందించారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, డెమ్స్ సభను నియంత్రించేవారని, సెనేట్‌లో రిపబ్లికన్లు 51-49తో గెలిచేవారని పేర్కొన్నారు. మస్క్ ఇటీవల బలమైన రాజకీయ వైఖరిని తీసుకున్నారు. కొత్త బడ్జెట్ బిల్లు అసహ్యంగా ఉందని, దానికి మద్దతిచ్చే ప్రజాప్రతినిధులు భవిష్యత్ ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement