త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ | Why SEBI working with Ministry of Finance to establish a centralized KYC | Sakshi
Sakshi News home page

త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ

May 5 2025 7:23 AM | Updated on May 5 2025 8:50 AM

Why SEBI working with Ministry of Finance to establish a centralized KYC

ఆర్థిక శాఖ, నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు

సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే 

న్యూఢిల్లీ: కేంద్రీకృత కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ, ఆర్థిక నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. కస్టమర్ల కేవైసీ వివరాలను ఒకే చోట నిర్వహించేదే సెంట్రల్‌ కేవైసీ. దీనివద్ద కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేస్తే.. అన్ని ఆర్థిక సంస్థల వద్ద ఆటోమేటిక్‌గా అది అప్‌డేట్‌ అయిపోతుంది.

ఎప్పటిలోగా ఈ వ్యవస్థను తీసుకొచ్చేదీ పాండే స్పష్టంగా వెల్లడించలేదు. కానీ వీలైనంత త్వరగా చేయాల్సి ఉందన్నారు. ఉమ్మడి కేవైసీ వ్యవస్థ గురించి ఎదురైన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఈ విషయంలోనూ మేము సానుకూలంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. మరింత సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన గల కమిటీ ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: బఫెట్‌ వారసుడొచ్చాడు..!

2025లో నూతన సెంట్రల్‌ కేవైసీ రిజిస్ట్రీని తీసుకురానున్నట్టు బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. సెక్యూరిటీలకు సంబంధించి టీప్లస్‌0 సెటిల్‌మెంట్‌ ప్రస్తుతం ఐచ్ఛికంగానే ఉందని పాండే చెప్పారు. దీనివల్ల మార్కెట్‌ భాగస్వాములు క్రమంగా కొత్త వ్యవస్థకు మారేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. నిఘా, ఐపీవో దరఖాస్తులను వేగంగా మదింపు వేసేందుకు ప్రస్తుతం సెబీ కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల దీన్ని వాడనున్నట్టు తెలిపారు. టీప్లస్‌1 ప్రస్తుతం తప్పనిసరిగా అమల్లో ఉన్న విధానం. స్టాక్స్‌ కొనుగోలు చేసిన తర్వాతి పనిదినం రోజున అవి కస్టమర్ల డీమ్యాట్‌ ఖాతాలకు జమ అవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement