
బెర్క్‌షైర్ సీఈవోగా గ్రెగ్ అబెల్‌కు బాధ్యతలు
ఈ ఏడాది చివర్లో బఫెట్ పదవీ విరమణ
ఆరు దశాబ్దాల నాయకత్వానికి గుడ్‌బై...
కంపెనీ వాటాదారుల సమావేశంలో షాకింగ్ ప్రకటన..
ఒమాహ: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ (94) ‘బెర్క్‌షైర్ హాతవే’ చైర్మన్‌గా ఈ ఏడాది చివర్లో తప్పుకోనున్నారు. తన స్థానంలో వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించాలంటూ కంపెనీ బోర్డుకు సిఫారసు చేయనున్నట్టు శనివారం ప్రకటించి ఇన్వెస్టర్లను, ఫాలోవర్లను షాక్‌కు గురిచేశారు. దీంతో ఆరు దశాబ్దాల పెట్టుబడుల యాత్రకు బఫెట్ ముగింపు పలకనున్నారు. ‘‘కంపెనీ సీఈవోగా ఈ ఏడాది చివర్లో గ్రెగ్ బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైంది’’అంటూ వాటాదారులతో నిర్వహించిన ప్రశ్న–జవాబుల కార్యక్రమం చివర్లో బఫెట్ ప్రకటించారు.
దీనిపైపై మాత్రం ప్రశ్నలకు అనుమతించలేదు. ఈ నిర్ణయం కంపెనీ బోర్డు సభ్యులైన తన ఇద్దరు పిల్లలు హోవర్డ్, సూసీ బఫెట్‌కు మాత్రమే తెలుసని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వేదికపై బఫెట్ పక్కనే గ్రెగ్ అబెల్ ఆసీనులై ఉండడం గమనార్హం. ‘‘బెర్క్‌షైర్ హాతవే కంపెనీ షేరు ఒక్కటి కూడా విక్రయించాలన్న ఉద్దేశం నాకు లేదు. చివరికి వీటిని విరాళంగా ఇచ్చేయాల్సిందే. కానీ, ప్రతీ షేరును కొనసాగించాలన్న నిర్ణయం ఆర్థిక కోణంలో తీసుకున్నదే. ఎందుకంటే నా కంటే కూడా గ్రెగ్ నాయకత్వంలో బెర్క్‌షైర్ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాను’’అని బఫెట్ తెలిపారు.
ఇప్పటికే కీలక బాధ్యతలు..
బఫెట్ భవిష్యత్ వారసుడిగా గ్రెగ్ అబెల్ (62) గతంలోనే నియమితులయ్యారు. కంపెనీ నాన్ ఇన్సూరెన్స్ వ్యాపార బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. కానీ, బఫెట్ మరణానంతరమే ఆయన స్థానంలో కంపెనీ బాధ్యతల్లోకి గ్రెగ్ వస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. తనకు రిటైర్మెంట్ ప్రణాళికలేవీ లేవంటూ లోగడ బఫెట్ ప్రకటించడం ఇందుకు దారితీసింది. బెర్క్‌షైర్ కంపెనీని నడిపించే సామర్థ్యాలు గ్రెగ్ అబెల్‌కు ఉన్నాయని చాలా మంది ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇకపై ఇన్సూరెన్స్ వ్యాపారం బాధ్యతల నిర్వహణతోపాటు కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను (2024 చివరికి 334 బిలియన్ డాలర్లు) అబెల్ ఎలా పెట్టుబడులుగా మలుస్తారన్న ఆసక్తి నెలకొంది. బఫెట్ ప్రకటన తర్వాత వేలాది మంది ఇన్వెస్టర్లు నిల్చుని మరీ దిగ్గజ ఇన్వెస్టర్ సేవలకు ప్రశంసలు కురిపించడం కనిపించింది. బఫెట్ సారథ్యంలో (1965 నుంచి నేటి వరకు) బెర్క్‌షైర్ ఎస్‌అండ్‌పీ 500 కంటే (ఏటా 10.4 శాతం) రెట్టింపు స్థాయిలో ఏటా 19.9 శాతం కాంపౌండెడ్ రాబడులు అందించడం గమనార్హం. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం వారెన్ బఫెట్ సంపద విలువ ప్రస్తుతం 169 బిలియన్ డాలర్లుగా ఉంది.