
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్‌లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్ ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. యూరప్, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్, మస్క్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి.
ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్‌కు భారత్ భారీ మార్కెట్‌గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.
యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించనుందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్
టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్‌యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్‌లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్‌లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది.