అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా(వీఐ).. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిల విషయంలో తగిన, దీర్ఘకాలిక పరిష్కారాన్ని ఆశిస్తోంది. ఈ సమస్యపై ప్రభుత్వంతో చురుగ్గా సంప్రదింపులు జరుగుతున్నాయని కంపెనీ సీఈఓ అభిజిత్ కిశోర్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దాదాపు రూ.78,500 కోట్ల ఏజీఆర్ బకాయిలు పేరుకుపోగా, దీనికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని తాజాగా సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, క్యూ2 ఫలితాల అనంతరం అభిజిత్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. నిధుల సమీకరణ కోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో సహా పలు మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఏజీఆర్ పరిష్కారంపైనే ఈ ప్రయత్నాలన్నీ ఆధారపడి ఉంటాయన్నారు. కాగా, 2025–26 సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్ధంలో వీఐ నికర నష్టం రూ.12,132 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.02 లక్షల కోట్లకు చేరింది.


