
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అన్ని పరిశ్రమల్లోనూ అనిశ్చితి ఆవహించింది. ఈ క్రమంలో స్వీడన్‌కు చెందిన భారీ వాహన తయారీ సంస్థ వోల్వో గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అనిశ్చితి, ట్రక్కులకు డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో అమెరికాలోని మూడు కర్మాగారాలలో 550 నుంచి 800 మంది కార్మికులను తొలగించేందుకు సిద్ధమైందని రాయిటర్స్ కథనం పేర్కొంది.
ఈ తొలగింపులు పెన్సిల్వేనియాలోని మకుంగీలో ఉన్న మాక్ ట్రక్స్ ప్లాంట్, వర్జీనియాలోని డబ్లిన్, మేరీల్యాండ్‌లోని హేగర్‌స్టౌన్‌లో ఉన్న రెండు వోల్వో సైట్‌లలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి. ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని, ముఖ్యంగా ఆటోమోటివ్, భారీ పరికరాల రంగాలను అస్తవ్యస్తం చేసి, తయారీ ఖర్చులను పెంచడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
👉ఇది చదివారా? ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. కార్ల కంపెనీ మూత
సుంకాలే కారణం..
ఉత్తర అమెరికాలో దాదాపు 20,000 మంది కార్మికులు ఉన్న వోల్వో సంస్థ భారీ-డ్యూటీ ట్రక్కులకు మార్కెట్ బలహీనంగా ఉన్నందున ఉత్పత్తిని సర్దుబాటు చేయడానికి ఈ ఉద్యోగ కోతలు అవసరమని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ రాయిటర్స్ వివరించింది. సరుకు రవాణా రేట్లలో అస్థిరత, సంభావ్య నియంత్రణ మార్పులు, సుంకాల వల్ల కలిగే విస్తృత ఆర్థిక ప్రభావం వంటి అనేక కారణాలు ఈ తొలగింపులకు దోహదపడ్డాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. “ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని నిర్ధారించడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము” ఆ ప్రతినిధి తెలిపారు.

ఇటీవలి నెలల్లో అమెరికా ట్రక్కింగ్ పరిశ్రమ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడీ సుంకాలు.. ముడి పదార్థాలు, విడి భాగాల ఖర్చులను మరింత పెంచాయి. ఫ్రైట్ డిమాండ్ తగ్గడం, ఆర్థిక అనిశ్చితి వంటివి వోల్వో వంటి స్థిరమైన వాణిజ్య పరిస్థితులపై ఆధారపడే సంస్థలను మరింత ఒత్తిడికి గురిచేశాయని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలగింపునకు సంభందించిన పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ ప్రభావితమైన కార్మికులకు సెవరెన్స్ ప్యాకేజీలు, ఇతర సాయాన్ని కంపెనీ అందించనున్నట్లు తెలుస్తోంది.