రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ఆధ్వర్యంలోని వంతారా(Vantara) జంతువుల సంరక్షణ, పునరావాస కార్యక్రమాలను హైలైట్ చేస్తూ ‘వంతారా-సాంక్చురీ స్టోరీస్’(Vantara-Sanctuary Stories) పేరుతో ఒక డాక్యుమెంటరీ సిరీస్‌ను జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
‘వంతారా-సాంక్చురీ స్టోరీస్’ సిరీస్‌లో వేటగాళ్ల బారిన పడిన, గాయపడిన లేదా నిరాదరణకు గురైన జంతువులను వంతారా బృందం ఎలా రక్షిస్తుంది అనే ఆపరేషన్లను చూపించనున్నారు. రక్షించిన జంతువులకు అందించే ప్రత్యేక వైద్య సంరక్షణ, పునరావాస ప్రక్రియను వివరిస్తారు. జంతువులను సంరక్షించే కేర్‌టేకర్లు, పశువైద్యులు వాటికి ఎలా చికిత్స అందిస్తారు, వాటి మధ్య ఏర్పడే నమ్మకం, ప్రేమ బంధాన్ని హైలైట్ చేసే అవకాశం ఉంటుంది.
వంతారాలో ఉన్న ఆధునిక వన్యప్రాణి ఆసుపత్రులు, చికిత్సలు, ఆక్యుపంక్చర్ వంటి సమగ్ర వైద్య పద్ధతులను వివరిస్తారు. జంతువులకు రక్షణ, పునరావాసం కల్పించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించాలనే వంతారా లక్ష్యాలను ఈ సిరీస్ తెలియజేస్తుందని కొందరు భావిస్తున్నారు.
వంతారా
అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఏటా కోటి రూపాయలు జీతం ఇస్తామన్నా చేసేవారు లేరు..


