
అమెరికాలో మరో కొత్త రకం పన్నుకు ట్రంప్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇది గనుక అమలులోకి వస్తే అక్కడ నివస్తున్న ప్రవాస భారతీయులపై (NRI) తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించి అమెరికా హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్‌లో మే 12న ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్‌పై 5 శాతం పన్ను విధించనున్నారు.
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లకు పెంచడం ద్వారా 2017 పన్ను కోతలు, ఉద్యోగాల చట్టాన్ని శాశ్వతం చేయాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండోసారి అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఈ చట్టాన్ని 'గ్రేట్' అని అభివర్ణిస్తూ, రిపబ్లికన్లు దీనిని ఆమోదించేలా చూడాలని కోరారు. మే 26 మెమోరియల్ డే నాటికి బిల్లును ఆమోదించాలని సభ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత అది సెనేట్‌కు వెళుతుంది. జూలై 4వ తేదీలోగా చట్టంగా మార్చాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
కొత్తగా వసూలు చేసే 5 శాతం రెమిటెన్స్ పన్నును పన్ను విరామాలకు నిధులు సమకూర్చడానికి, సరిహద్దు భద్రతా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు. ఇది యూఎస్ ట్రెజరీకి బిలియన్లకొద్దీ ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ కష్టపడి డబ్బులు సంపాదించుకుని వాటిని తమ దేశాల్లోని కుటుంబాలకు పంపించే విదేశీయులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.
ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావం
భారత్‌లోని తమ కుటుంబాలకు డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు ఈ పన్ను తీవ్ర ఆర్థిక ప్రభావాలను కలిగిస్తుంది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్‌కు ఏటా 8,300 కోట్ల డాలర్ల రెమిటెన్స్ లు పంపుతుండగా, అందులో ఎక్కువ భాగం అమెరికా నుంచే అందుతున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లోని తమ కుటుంబాలకు పంపే ప్రతి లక్ష రూపాయలకు రూ.5,000 పన్ను రూపంలో యూఎస్ ప్రభుత్వానికి వెళ్తుంది.