UAE: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం! | UAE Announces Social Media Ban For Children Under 15 | Sakshi
Sakshi News home page

UAE: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

Jun 18 2026 4:43 PM | Updated on Jun 18 2026 4:48 PM

UAE Announces Social Media Ban For Children Under 15

పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం, దాని వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేయడం, ఉపయోగించడాన్ని నిషేధిస్తూ.. ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూఏఈ, ఇప్పటికే ఇలాంటి చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాల జాబితాలో చేరింది.

యూఏఈ మంత్రివర్గం ఆమోదించిన తీర్మానం ప్రకారం, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను తెరవడం పూర్తిగా నిషేధం. అంతేకాకుండా.. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని పూర్తి ఫీచర్లను కూడా ఉపయోగించకూడదు. పోస్టులు చేయడం, కామెంట్లు పెట్టడం, కంటెంట్ షేర్ చేయడం, పబ్లిక్ గ్రూపులు లేదా ఓపెన్ ఛానళ్లలో చేరడం వంటి కార్యకలాపాలకు కూడా అనుమతి ఉండదు.

ఈ నిబంధనలను అమలు చేయడంలో సోషల్ మీడియా సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించారు. 15 ఏళ్లలోపు పిల్లలు సృష్టించిన ఖాతాలను గుర్తించి, వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం కంపెనీలకు 12 నెలల గడువు ఇచ్చారు. ఒకవేళా నిబంధనలను పాటించకపోతే.. సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లపై హెచ్చరికలు, పరిమితులు లేదా పూర్తిస్థాయి నిషేధం వంటి చర్యలు తీసుకునే అధికారం యూఏఈ ప్రభుత్వ సంస్థలకు ఉంటుంది.

సోషల్ మీడియా ద్వారా పిల్లలు అనుచిత కంటెంట్, సైబర్ బుల్లీయింగ్, ఆన్‌లైన్ మోసాలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతను పెంచడం, ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల సోషల్ మీడియా వినియోగంపై పలు దేశాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు యూఏఈ కూడా అదే దారిలో అడుగులు వేయడంతో, భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement