అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు బాగానే జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా 2026లో ఇండియా పర్యటన చేయబోతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ రష్యాతో భారతదేశ ఇంధన సంబంధాలపై ఆయన తన కఠిన వైఖరిని తెలియజేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించాలని చెప్పారు.
వాణిజ్య చర్చలు
వైట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తి, మంచి స్నేహితుడు అని ప్రశంసించారు. వాణిజ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి విస్తృత ప్రయత్నం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘మోదీ రష్యా నుంచి చమురు కొనడం చాలా వరకు నిలిపేశారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. తన భారత పర్యటన గురించి అడిగినప్పుడు ‘మేము చర్చిస్తున్నాం. నేను అక్కడికి రావాలని మోదీ కోరుకుంటారు. నేనూ వెళ్తాను. 2026లో వెళ్లే అవకాశం ఉంది’ అని స్పందించారు.
భౌగోళిక రాజకీయ సాధనంగా సుంకాలు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్ వస్తువులపై 50% సుంకం విధించింది. ఇందులో 25% పరస్పర సుంకం కాగా, రష్యన్ చమురు కొనుగోళ్లకు అదనంగా 25% సుంకం జోడించారు. యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఇటీవల ఈ సుంకాలను సమర్థించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చే వ్యూహాత్మక చర్యగా ఆ సుంకాలను రూపొందించినట్లు చెప్పారు. ‘రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ సుంకాలను ఉపయోగిస్తున్నారు. దానివల్లే ఇండియా చమురు కొనడం ఆపండంటూ ట్రంప్ చెప్పారు’ అని అన్నారు. అయితే, భారత్ ఈ వాదనలను ఖండించింది. రష్యన్ చమురును కొనుగోలు చేయడం సార్వభౌమ నిర్ణయం అని తెలిపింది. భారత్ ఏ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించదని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా?


