ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా: స్పందించిన మస్క్! | Tesla Crash in America Know The Elon Musk Responds | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా: స్పందించిన మస్క్!

Jun 23 2026 2:58 PM | Updated on Jun 23 2026 3:51 PM

Tesla Crash in America Know The Elon Musk Responds

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఒక టెస్లా మోడల్ 3 కారు అధిక వేగంతో ఓ ఇంటిలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల మహిళ మరణించింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం ఉపయోగించినట్లు సమాచారం రావడంతో, టెస్లా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై ప్రశ్నలు తలెత్తాయి.

ప్రమాదం ఎలా జరిగింది?
స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. 44 ఏళ్ల మైఖేల్ బట్లర్ కారును డ్రైవ్ చేసే సమయంలో ఒక ఇంటిని ఢీకొట్టాడు. ఈ ప్రమాద సమయంలో డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ యాక్టివ్‌గా ఉన్నట్లు అతను విచారణాధికారులకు తెలిపారు. కారు ఇంటి గోడను బలంగా ఢీకొట్టి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 76 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొంతసేపటి తరువాత మరణించారు.

కుటుంబ సభ్యుల ప్రకారం.. కారు ఢీకొట్టిన ప్రదేశంలో (ఇంట్లో) పిల్లలు తరచుగా ఉండేవారు. కానీ ఆ రోజు ఎవరూ లేదు. మహిళ తప్పా.. మరెవరికి ప్రమాదం జరగలేదు.

ప్రమాదంలో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అయితే అధికారులు అతడు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించినట్లు లేదని తెలిపారు. కాగా ప్రస్తుతం అతను దర్యాప్తుకు సహకరిస్తున్నాడు. ఇప్పటివరకు అతనిపై ఎటువంటి కేసులు లేదా అభియోగాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.

దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం సమయంలో కారు ఏ సిస్టమ్‌ను ఉపయోగిస్తోందో స్పష్టంగా తెలియలేదు. అది టెస్లా 'ఆటోపైలట్' వ్యవస్థనా, లేక ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD)నా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.

ఎలాన్ మస్క్ స్పందన
ఈ ఘటనపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందిస్తూ, డ్రైవింగ్ సిస్టమ్ కారణంగా ప్రమాదం జరిగిందనే ఆరోపణలను ఖండించారు. ఆయన ప్రకారం.. FSD వ్యవస్థను నివాస ప్రాంతాల్లో చాలా తక్కువ వేగంతో ప్రయాణించేలా రూపొందించినట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదం అధిక వేగంతో జరిగింది కాబట్టి, ఈ ఆరోపణలు సరైనవిగా కనిపించడం లేదని చెప్పారు.

టెస్లా ఏఐ విభాగం వివరణ
టెస్లా ఏఐ హెడ్ అశోక్ ఎల్లుస్వామి కూడా స్పందించారు. డ్రైవర్ యాక్సిలరేటర్‌ను పూర్తిగా (100%) నొక్కి స్వయంచాలక డ్రైవింగ్‌ను మాన్యువల్‌గా ఓవర్‌రైడ్ చేశాడు. ప్రమాదం సమయంలో కారు గంటకు సుమారు 73 మైళ్ల (దాదాపు 117 కి.మీ.) వేగంతో ప్రయాణించింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా యాక్సిలరేటర్ నొక్కిన స్థితిలోనే ఉందని టెస్లా డేటా సూచిస్తోందని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement