మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన జీతం. సగటు యువత కోరుకునేది ఇదే కదా..? కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. కొందరే కష్టపడి ఈ కలను సాకారం చేసుకుంటారు. ఎంత తక్కువ జీతంతో ప్రారంభించామన్నది ముఖ్యం కాదు.. ఎంత తక్కువ కాలంలో మంచి జీతానికి చేరుకున్నామన్నదే ప్రధానం.
ఐదేళ్లలో పది రెట్లు జీతం పెంపును సాధించిన ఓ భారతీయ టెక్ ప్రొఫెషనల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తన ప్రయాణాన్ని ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ రెడిట్ (Reddit)లో పంచుకున్నారు. “ఒక చిన్న విజయాన్ని పంచుకోవాలనుకున్నాను. ఐదేళ్ల క్రితం నెలకు రూ.18,000 జీతంతో ఒక చిన్న స్టార్టప్‌లో నా కెరీర్ ప్రారంభించాను. అది సులభం కాదు.. గంటల కొద్దీ పని, నిరంతర అభ్యాసం, మధ్యలో ఎన్నో తప్పులు.. కానీ ప్రతీదీ అనుభవం నేర్పింది” అని రాసుకొచ్చారు.
React, Node.js, Python, AWS వంటి టెక్ స్టాక్‌లో నైపుణ్యం కలిగిన ఈ ప్రొఫెషనల్ ప్రస్తుతం నెలకు రూ.1.8 లక్షల జీతంతో కొత్త ఆఫర్ అందుకున్నారని తెలిపారు. “ఐదేళ్లలో 10 రెట్లు ఎదుగుదల సాధించాను. ఈ ప్రయాణంపై నాకు నిజంగా గర్వంగా ఉంది. నిద్రలేని రాత్రులు, కఠినమైన ఫీడ్‌బ్యాక్, పట్టుదల.. ఇవన్నీ ఫలించాయి. ఇప్పటికీ కష్టపడుతున్న వారందరికీ నా సందేశం.. ఆగకండి, నేర్చుకుంటూ కొనసాగండి. కచ్చితంగా మెరుగవుతుంది” అని ఆయన అన్నారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. యూజర్ల నుంచి అభినందనల వర్షం కురిసింది. “మీరు ఏమి నేర్చుకునేవారు? ఉద్యోగం, నైపుణ్యాభివృద్ధి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేశారు?” అంటూ కొందరు సలహాలు కోరగా.. తామూ కూడా ఇలాగే పురోగతి సాధించినట్లు మరికొందరు తమ అనుభవాలను కామెంట్ల రూపంలో తెలియజేశారు.
👉ఇది చదివారా? టీసీఎస్ షాకింగ్ శాలరీ..


