
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులను చూస్తుంటే.. ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు, ఎందుకు, ఎలా పోతున్నాయో కూడా అర్థం కానీ పరిస్థితి కనిపిస్తోంది. దుర్గా పూజకు.. అనుమతితో సెలవు తీసుకున్నందుకు ఉద్యోగం నుంచి తీసేశారంటూ.. ఒక టెకీ రెడ్దిట్ వేదికగా పోస్ట్ చేశారు.
దుర్గా పూజకు సెలవు తీసుకున్నందుకు తొలగించారు.. అనే శీర్షికతో వైరల్ అయిన రెడ్డిట్ పోస్ట్‌లో ఒక టెకీ తన అనుభవాన్ని వెల్లడించారు. నేను సెలవు తీసుకుంటానని మూడు వారాల ముందే మేనేజర్‌కు సమాచారం ఇచ్చాను. కంపెనీ సీఈఓ నుంచి కూడా అనుమతి పొందాను. కానీ హెచ్ఆర్ నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు టెర్మినేషన్ మెయిల్‌లో పేర్కొన్నారు. అనుమతి లేకుండా సెలవు తీసుకున్న కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా కంపెనీ కోసం ఎంతో కష్టపడి పనిచేసాను. పనిగంటలు పొడిగించినప్పుడు కూడా వర్క్ చేసాను. అనుమతితో సెలవు తీసుకున్నప్పటికీ.. నన్ను కంపెనీ నుంచి తొలగించారు. నాకు చాలా బాధగా ఉంది. కంపెనీ వాళ్ళు నాకు రిలీవింగ్, ఎక్స్‌పీరియన్స్ లెటర్, పే స్లిప్స్ వంటివి ఇస్తారా లేదా అనే సందేహం కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో నాకు సలహా ఇవ్వండి అని పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 'మీరు ఆ కంపెనీలోనే ఉంటే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులో ఎదుర్కొనేవారు' అని ఒకరు వెల్లడించగా.. ''వినడానికి బాధగా ఉంది, మీరు ఏదో చిన్న స్టార్టప్‌లో పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది, అలాంటి సంస్థల్లో.. ఇలాంటివి చాలా సాధారణం'' అని ఇంకొకరు అన్నారు.